21, మార్చి 2024, గురువారం

Does a person die if a crow scratches head? - కాకి తలపై గీరితే చనిపోతారా?

 


కాకులు మన ఇళ్ల దగ్గరే జీవిస్తాయి. ఎక్కువగా కొబ్బరి చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. మనం తినే చాలా రకాల ఆహారాలను కాకులు తింటాయి. మన పురాణాల్లో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతేకాదు.. కాకులు చాలా తెలివైనవి. క్రమశిక్షణ పాటిస్తాయి. ఒక కాకికి ఆహారం దొరికితే, అది మిగతా కాకులనూ పిలుస్తుంది. అలాగే ఒకటి చనిపోతే, మిగతా కాకులన్నీ బాధ వ్యక్తం చేస్తాయి. అందుకే కాకుల పట్ల మనం పాజిటివ్ ఫీలింగ్స్‌తో ఉంటాం. అయితే.. ఒక్కోసారి కాకులు మనపై దాడి చేస్తాయి. ఎందుకో తెలుసుకుందాం.


సాధారణంగా కాకులు మనపై దాడి చెయ్యవు. కాకుల గూళ్లలో పిల్లలు ఉన్నప్పుడు, ఆ చెట్లకు దగ్గరగా ఎవరైనా వెళ్తే, కాకులు దాడి చేస్తాయి. అలాగే.. పిల్లల్లో ఏదైనా మిస్సింగ్ అయితే కూడా.. కాకులు ఆగ్రహంతో అటుగా వచ్చే వారిపై దాడి చేస్తాయి. ఇలా దాడి చేసేటప్పుడు అవి వేగంగా వచ్చి.. కాలి గోళ్లతో తలపై గీరుతూ ఎగురుతాయి. మరి ఇలా గీరితే చనిపోతారనే ప్రచారం ఉంది. నిజానికి అది మూఢనమ్మకం మాత్రమే.


ఈ మూఢనమ్మకం రావడానికి కారణం.. పేదరికం. పూర్వం కాకులు దాడి చేసినప్పుడు సరైన వైద్య సదుపాయాలు ఉండేవి కావు. ఐతే.. కాకులు రకరకాల ఆహారాలను కాలి గోళ్లతో చీల్చుతూ తింటాయి. కుళ్లిపోయిన వాటినీ, చనిపోయిన జీవుల మాంసాన్నీ కాళ్లతో పీక్కుతింటాయి. అందువల్ల వాటి గోళ్లలో రకరకాల వైరస్, బ్యాక్టీరియా ఉంటాయి. అవి కాళ్లతో తలపై గీరినప్పుడు, గాయం అయితే.. ఆ వైరస్, బ్యాక్టీరియా, ఆ గాయం ద్వారా శరీరంలోకి వెళ్లగలవు. అలాంటి సందర్భంలో.. జబ్బులు వచ్చి, చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే కాకి గీరితే, చనిపోతారనే మూఢనమ్మకం వచ్చింది.


ఈ రోజుల్లో వైద్య సదుపాయాలు చాలా డెవలప్ అయ్యాయి. కాకి గీరినప్పుడు షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే కాకి దాడి చేస్తున్నప్పుడు.. ఓ కర్రను తల కంటే పైకి పట్టుకుంటే.. కర్ర కారణంగా కాకి దగ్గరకు రాదు. అలా కాకుల దాడి నుంచి తప్పించుకోవచ్చు.