7, మే 2024, మంగళవారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 10

 


భూమి ఇప్పుడు ఉన్న సైజ్ కంటే డబుల్ సైజ్ ఉంటే.. వెంటనే చెట్లన్నీ కూలిపోతాయి. ఎందుకంటే.. సర్ఫేస్ గ్రావిటీ.. డబుల్ అవుతుంది. అది చెట్లను బలంగా లాగేస్తుంది. అందువల్ల అవి కూలిపోతాయి. అంతేకాదు.. కుక్క సైజులో లేదా అంతకంటే పెద్ద సైజులో ఉండే జంతువులు పరుగెత్తలేవు. పరుగెడితే, వాటి కాళ్లు విరిగిపోతాయి. అందుకే.. మన భూమి సరైన సైజులోనే ఉంది అనుకోవచ్చు.


సంవత్సర కాలంలో నేరాలు ఎక్కువగా జరిగేది ఎండాకాలంలోనే. ఎందుకంటే సమ్మర్‌లో వేడి కారణంగా మనుషుల్లో చిరాకు ఎక్కువగా ఉంటుంది. మూడ్ మారిపోయి, త్వరగా కోపం వస్తుంది. ఆ కోపంలో, ఆవేశంలో అనుకోకుండా నేరాలు చేస్తుంటారు. హత్యా నేరాలు కూడా వేసవిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాగే జరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.


కొత్తగా కొన్న కారు ప్రత్యేకమైన వాసన వస్తూ ఉంటుంది. నిజానికి అది సింగిల్ కెమికల్ వాసన కాదు. దాదాపు 200 రకాల రసాయనాలను కారు తయారీలో వాడుతారు. వీటిలో సిక్లీ స్వీట్, టాక్సిక్ హైడ్రోకార్బన్స్ అయిన బెంజీన్, టొల్యూన్ వంటివి ఉంటాయి. ఇవన్నీ కలిపి.. ప్రత్యేక వాసన వస్తాయి.


మనం శ్వాస తీసుకున్న ప్రతిసారీ.. 50 రకాల శక్తిమంతమైన, హానికరమైన బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది. అదృష్టం కొద్దీ.. మన ఇమ్యూనిటీ సిస్టం.. నిరంతరం కష్టపడుతూ.. ఆ బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. ఇది చాలా వేగంగా, మనకు తెలియకుండానే జరుగుతుంది. అందుకే వ్యాధి నిరోధక శక్తి కోల్పోకుండా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం.


లండన్ లోని ఇంపెరియల్ కాలేజీ పరిశోధకుల ప్రకారం.. మనుషులు ప్రతీ గంటకూ 20 కోట్ల చర్మ కణాలను విడుస్తున్నారు. ఇవి గాలిలో దుమ్ము రూపంలో ఎగురుతున్నాయి. అందరి ఇళ్లలోనూ ఇవి ఉంటాయి. ఈ కణాలు విడివిడిగా ఉన్నప్పుడు, మన కళ్లు వాటిని డైరెక్టుగా చూడలేవు.


భూమి మధ్యలో.. కోర్ భాగంలో... 1.6 క్వాడ్రిల్లియన్ టన్నుల బంగారం ఉందని అంచనా. అంటే.. భూమిపై మనం వాడుతున్నది 1 శాతం బంగారం మాత్రమే. మిగతా 99 శాతం గోల్డ్.. కోర్ భాగంలో ఉందని డిస్కవర్ మేగజైన్ రిపోర్ట్ చేసింది. ఆ బంగారం మొత్తాన్నీ వెలికితీస్తే.. దానితో భూమి మొత్తానికీ బంగారం పూత పుయ్యవచ్చు. అది కూడా ఒకటిన్నర అడుగుల మందంతో. 


ఆకాశంలో మనం రోజూ చూస్తున్న నక్షత్రాలు.. 4వేల సంవత్సరాల కిందట ఎలా ఉన్నాయో.. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అంటే.. దాదాపుగా ఈజిప్ట్ పిరమిడ్లను నిర్మిస్తున్న సమయంలో ఆ నక్షత్రాలు ఎలా ఉండేవో.. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ నక్షత్రాలు మనకు దాదాపు 4వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో మనం భూమిపై నుంచి చూడాలంటే... మరో 4వేల సంవత్సరాలు వెయిట్ చెయ్యాలి.



4, మే 2024, శనివారం

If plug is not removed, will the electricity be consumed? - ప్లగ్‌లు తియ్యకపోతే కరెంట్ ఖర్చవుతుందా?

 


ఈ రోజుల్లో కరెంటు బిల్లులు బాగా పెరిగిపోతున్న సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. కరెంటును ఆదా చేసేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఐతే.. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేసినా, ప్లగ్ తియ్యకపోతే కరెంట్ ఖర్చవుతుందా అనే ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకుందాం.


టెక్నాలజీ అప్‌గ్రేడ్ కారణంగా చాలా ఎలక్ట్రిక్ పరికరాలకు రిమోట్లు ఉన్నాయి. టీవీ, ఫ్యాన్, ఏసీ, లైట్స్ ఇలా ప్రతీ దానికీ రిమోట్ లేదా మొబైల్ యాప్‌తో కనెక్టివిటీ ఉంటోంది. అందువల్ల వాటిని స్విచ్ ఆఫ్ చేసేందుకు రిమోట్ వాడుతున్నారు. ఐతే.. నిపుణుల ప్రకారం.. రిమోట్‌తో ఆపినా.. కరెంటు సప్లై పూర్తిగా ఆగిపోదు. రిమోట్‌తో ఆఫ్ చేసినా.. కొంత కరెంటును ఆ గాడ్జెట్స్ వాడుకుంటూ ఉంటాయి. అవి స్లీప్‌మోడ్‌ లేదా స్టాండ్ బై మోడ్‌లోకి వెళ్తాయే తప్ప.. పూర్తిగా ఆఫ్ అవ్వవు. అందుకే.. తిరిగి రిమోట్‌తో ఆన్ చేసినప్పుడు అవి ఆన్ అవుతాయి.


కరెంటును సేవ్ చెయ్యాలంటే.. డైరెక్టుగా స్విచ్ ఆఫ్ చెయ్యడమే బెటర్ అంటున్నారు నిపుణులు. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే పూర్తిగా ఎలక్ట్రిసిటీ ప్రవాహం ఆగుతుందని చెబుతున్నారు. ఐతే.. స్విచ్ ఆఫ్ చేశాక.. ప్లగ్‌లు తీసేయాల్సిన పని లేదు. ప్లగ్‌లు ఉన్నా.. కరెంటు సప్లై అవ్వదు. ఐతే.. వేరే ఊరు వెళ్లేవారు, ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు.. షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా.. ప్లగ్‌లు కూడా తీసేయడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.


2, మే 2024, గురువారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 9


వర్షం పడేటప్పుడు ఆకాశంలో మెరుపులు రావడం చూస్తుంటాం. ఈ మెరుపు చాలా వేడిగా ఉంటుంది. సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడి కంటే.. మెరుపు వేడి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే.. సూర్యుడి ఉపరితలంపై 5వేల 700 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. మెరుపు వేడి ఏకంగా 30వేల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందుకే ఉరుములు, మెరుపులు, పిడుగులతో జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడేటప్పుడు చెట్ల కిందకు వెళ్లకూడదు.


పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ వాటిని కూడా ఎక్కువగా తినకూడదు. పండ్లలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ అనేది.. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. దానివల్ల బరువు పెరుగుతారు. హైబీపీ, గుండె జబ్బుల వంటి రాగలవు. అందుకే.. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆహారాలను తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యాపిల్స్, అరటి, మామిడి, ద్రాక్ష, ఖర్జూరాలు, పుచ్చకాయ, ఫిగ్స్, పియర్స్, తేనెలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఫ్రక్టో్జ్ తక్కువగా ఉండాలంటే, ఇవి అత్యంత తాజాగా ఉన్నప్పుడు తినాలి. అప్పుడు ఫ్రక్టోజ్ కంటే ఫైబర్ ఎక్కువగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


పెంగ్విన్లు మనిషి కంటే వేగంగా నడవగలవు. ఎగరలేని ఈ పక్షులు.. అంటార్కిటికాలో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో జీవిస్తాయి. ఇవి తమ జీవితకాలంలో సగం కాలం మంచులో, సగం కాలం సముద్రంలో జీవిస్తాయి.


ప్రపంచంలో అతిపెద్ద ముక్కు ఉన్న పక్షి ఆస్ట్రేలియా పెలికాన్ పక్షి. దీని ముక్కు 47 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీనికి ముక్కు కింద పెద్ద సంచి లాంటిది ఉంటుంది. ఇందులో చేపల్ని స్టోర్ చేసి.. తమ పిల్లల కోసం తీసుకెళ్తాయి. 


ఆపద సమయంలో చేపలు గుంపుగా వెళ్లడమే కాదు.. క్యూ పద్ధతి కూడా పాటిస్తాయని సైంటిస్టులు కనుక్కున్నారు. క్యూ పద్ధతి వల్ల చేపలు వేగంగా వెళ్లడమే కాదు.. ఎలాంటి తొక్కిసలాటలూ జరగట్లేదు. ఎమర్జెన్సీ టైంలో ఇలా చేపలు సోషల్ రూల్స్ పాటించడం గొప్ప లక్షణం అంటున్న సైంటిస్టులు.. మనుషుల్లో ఇది కనిపించట్లేదని తెలిపారు.


దక్షిణ ధృవం నుంచి చందమామను చూస్తే.. అది తలకిందులుగా కనిపిస్తుంది. అంటే.. చందమామపై ఒక మనిషి నిలబడితే.. భూమిపై ఉత్తర ధృవం నుంచి చూసినప్పుడు.. ఆ మనిషి మామూలుగా నిలబడినట్లుగానే కనిపిస్తారు. అదే దక్షిణ ధృవం నుంచి ఆ మనిషిని చూస్తే.. తలకిందులుగా కనిపిస్తారు. అక్కడ చందమామ రివర్సులో ఉంటుంది. మూన్‌పై ఉండే మచ్చలు.. దక్షిణ ధృవం నుంచి చూసినప్పుడు దాదాపు ర్యాబిట్ ఆకారంలో కనిపిస్తాయి.


వర్షం వచ్చే ఒక రోజు ముందే తాబేళ్లు.. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోతాయి. అలాగే.. సముద్ర పక్షులు తీరాన్ని చేరుకొని సైలెంట్ అయిపోతాయి. మామూలు పక్షులు.. నేలకు దగ్గరగా ఎగురుతాయి. ఇవన్నీ గమనిస్తే.. మనం కూడా వర్షం వస్తోందని అర్థం చేసుకోవచ్చు. ఈ భూమిపై ప్రతి నిమిషానికీ వంద కోట్ల టన్నుల వర్షం పడుతోంది.



22, ఏప్రిల్ 2024, సోమవారం

How is glass made from sand? - ఇసుకతో గాజును ఎలా తయారు చేస్తారు?

 


ఇసుకతో గాజును తయారుచేస్తారని చాలా మందికి తెలుసు. కానీ ఎలా అన్నది తెలియకపోవచ్చు. ఎక్కడో సముద్రాలు, నదుల దగ్గర దొరికే ఇసుకతో.. అందమైన, పారదర్శకమైన గ్లాస్ ఎలా తయారవుతుంది? ఆ ప్రక్రియ తెలుసుకుందాం.


గ్లాస్ తయారీకోసం ముందుగా మెత్తని ఇసుకను సేకరిస్తారు. తర్వాత దానికి సోడియం కార్బొనేట్‌ని కలుపుతారు. ఈ మిశ్రమాన్ని పెద్ద యంత్రాల ద్వారా మెత్తని పొడిలా చేస్తారు. ఆ తర్వాత ఈ పొడిని దాదాపు 1700 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ వేడి చేస్తారు. ఈ వేడి ఎంత ఎక్కువంటే.. అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ షటిల్.. తిరిగి భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు దాదాపు ఇదే వేడి దాని షీల్డ్‌కి తగులుతుంది. ఇసుకను గాజులా మార్చేందుకు అంతలా వేడి చెయ్యాల్సి ఉంటుంది.


వేడి కారణంగా.. ఇసుక, సోడియం కార్బొనేట్ కలిసి.. బాగా మరిగిపోయి, బుడగలు వస్తూ.. మెత్తని, జిగురులాంటి పదార్థంలా మారుతుంది. బెల్లంని వేడి చేసినప్పుడు అది ఎలా జిగురులా మారుతుందో, అలా ఈ పదార్థం కూడా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ చల్లబరుస్తారు.


1000 డిగ్రీలకు చల్లారిన తర్వాత, ఈ మిశ్రమంలో మాంగనీస్ డై ఆక్సైడ్ కలుపుతారు. ఇది ఎందుకంటే.. ఇసుక మిశ్రమం తెల్లగా ఉండదు. ఇందులో కొన్ని మలినాలు ఉంటాయి. అవి పోయేందుకు మాంగనీస్ డై ఆక్సైడ్ కలపగానే.. ఆటోమేటిక్‌గా మలినాలు పోయి.. పారదర్శకమైన, స్వచ్ఛమైన గాజు పదార్థం తయారవుతుంది.


ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ తయారవ్వగానే.. ఆ మిశ్రమంలో.. మెటల్ ఆక్సైడ్‌లను కలుపుతారు. తద్వారా గ్లాస్‌లు రకరకాల రంగుల్లోకి మారతాయి. ఆ తర్వాత చల్లారుతున్న దశలో మెషిన్ల సాయంతో రకరకాల సైజుల్లో గ్లాస్ లను తయారుచేస్తారు. ఆ తర్వాత వాటికి షైనింగ్ ఇవ్వడం, కావాల్సిన షేప్ లోకి మార్చడం జరుగుతుంది. ఇలా ఇసుక నుంచి గ్లాస్ తయారీ చాలా కష్టమైన, ప్రమాదకరమైన పని. ఈ రోజుల్లో ఈ పనిని మెషిన్లతోపాటూ, సంప్రదాయ పద్ధతుల్లో కూడా చేస్తున్నారు.



20, ఏప్రిల్ 2024, శనివారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 8

 


మనం భూమిపై ఉంటూ.. రోజూ 26 లక్షల కిలోమీటర్లు సూర్యుడి చుట్టూ ట్రావెల్ చేస్తున్నాం. అంటే గంటకు లక్ష కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్నాం. మరోలా చెప్పాలంటే.. మనం సెకండ్‌కి 29 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తున్నాం.


నీరు తడి అవ్వదు అనేది ఎక్కువమంది శాస్త్రవేత్తల భావన. అంటే.. నీరు ఏదైనా సాలిడ్ సర్ఫేస్‌ని టచ్ చేసినప్పుడు.. ఆ సర్ఫేస్ తడి అయ్యేలా నీరు చెయ్యగలదు. అది నీటికి ఉన్న సామర్థ్యం. అంతే తప్ప.. నీటికి స్వయంగా తడి ఉండదు.


నత్తలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి తమ కాళ్ల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఇవి రాళ్లు, నేలపైనే కాదు.. బ్లేడు అంచుపై కూడా ఏమాత్రం కోసుకుపోకుండా నడవగలవు. అంతేకాదు.. నత్త కావాలనుకుంటే డీప్ స్లీప్ లోకి వెళ్లగలదు. దాదాపు 3 ఏళ్లపాటూ కంటిన్యూగా నిద్రపోగలదు. 


ప్రపంచంలోనే అతి చిన్న సముద్రం ఉత్తర యూరప్ లోని బాల్టిక్ సముద్రం. ఇది 1610 కిలోమీటర్ల పొడవు, 193 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని లోతు 180 అడుగులు మాత్రమే.


మన సౌర కుటుంబానికి ఒక గోడ లాంటిది ఉంది. దాన్నే హీలియోపాజ్ (Heliopause) అంటారు. ఇది చివరి గ్రహం తర్వాత ఉంటుంది. ఇది మన ఇళ్లకు కాంపౌండ్ వాల్ లాగా పనిచేస్తుంది. ఎలా అంటే.. సూర్యుడి నుంచి వచ్చే సౌర గాలులు.. హీలియోపాజ్ వరకూ వెళ్తాయి. ఇవి.. వేరే సూర్యుళ్ల నుంచి, గెలాక్సీల నుంచి వచ్చే సౌర గాలులను హీలియోపాజ్ దగ్గర అడ్డుకుంటాయి. తద్వారా ఆ ప్రమాదకర గాలులు.. మన సౌర కుంటుంబంలోకి రాకుండా అక్కడే ఆగిపోతాయి. తద్వారా మనం సేఫ్‌గా ఉంటున్నాం.


తోకచుక్కల వాసన ఎలా ఉంటుంది.. అని పరిశోధించగా.. షాకింగ్ విషయం తెలిసింది. అవి కుళ్లిపోయిన కోడిగుడ్ల వాసన కలిగివుంటాయని తెలిసింది. ఇంకా యూరిన్, కాలుతున్న అగ్గిపుల్ల, బాదం పప్పుల వాసన కలిగివుంటాయి. తోకచుక్కల్లో హైడ్రోజన్ సల్ఫైడ్, అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ వంటి వాటిని సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల తోకచుక్కల వాసన ఘాటుగా, భరించలేని విధంగా ఉంటుందని తేల్చారు.


వాన చినుకులు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో భూమిపై పడతాయి. ఐతే.. వానకి గాలి తోడైతే.. చినుకుల వేగం గంటకు 35 కిలోమీటర్లకు పెరగగలదు. మరో విషయం.. వాన చినుకుల సైజు.. దేనికదే వేర్వేరుగా ఉంటుంది. ఏ రెండు చుక్కల సైజూ ఒకేలా ఉండదు.


18, ఏప్రిల్ 2024, గురువారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 7



మన శరీరంలో సగానికి పైగా మానవ శరీరం కాదు. మన శరీరంలో మానవ శరీర కణాల కంటే ఎక్కువ కణాలు సూక్ష్మక్రిములవి ఉన్నాయి. పరిశోధనల ప్రకారం.. యావరేజ్‌గా మనిషి శరీరంలో 56 శాతం సూక్ష్మక్రిములు ఉన్నాయి. వీటిలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగీ, ఆర్కియా వంటివి ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు.


కుక్కలకు కూడా కలలు వస్తాయి. వాటిలో మంచి కలలు, పీడకలలు.. అన్ని రకాలూ ఉంటాయి. ఈ కారణంగా ఒక్కోసారి కుక్కలు నిద్రలో కలవరిస్తాయి. 


మన బ్రెయిన్, తనను తాను తింటూ ఉంటుంది. ఈ ప్రక్రియను ఫాగోసైటోసిస్ (phagocytosis) అంటారు. ఈ ప్రక్రియలో కణాలు, చిన్న కణాలు లేదా అణువులను ఆవరించి, వాటిని వ్యవస్థ నుంచి తీసివేస్తాయి. ఐతే, ఇది మంచిదే. హాని చేసేది కాదు. నిజానికి ఇది గ్రే మ్యాటర్‌ని కాపాడుతుంది. ఈ గ్రే మ్యాటర్ వల్ల బ్రెయిన్ బాగా పనిచేస్తుంది.


మనుషుల గోర్లు ఎండాకాలంలో త్వరగా పెరుగుతాయి. ఎందుకంటే.. వేడి కారణంగా వేళ్ల చివరి ప్రాంతానికి రక్తం ఎక్కువగా సప్లై అవుతుంది. సంవత్సరమంతా ఎండ ఎక్కువగా ఉండే ఇండియా లాంటి దేశాల్లో ప్రజలకు గోర్లు త్వరగా పెరుగుతాయి.


ప్రపంచంలో అతి చిన్న యుద్ధం 1896 ఆగస్టు 27న బ్రిటన్, జాంజిబార్ మధ్య జరిగింది. ఈ యుద్ధం 38 నిమిషాల్లో ముగిసింది.


మనం జూకి వెళ్లినప్పుడు నీటి ఏనుగులను నీటిలో చూస్తుంటాం. అందువల్ల అవి నీటిలో ఈత కొడతాయి అనుకుంటాం. నిజానికి అవి నీటిలో ఈత కొట్టలేవు. వాటి ఎముకలు చాలా పెద్దవి, ధృడంగా ఉంటాయి. అందువల్ల నీటి ఏనుగులు నీటిలో తేలలేవు. ఐతే.. అవి నీటిలో ఈతకు బదులుగా, నాలుగు కాళ్లతో నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్తాయి. అలా వెళ్లేటప్పుడు తమ తలను నీటిపైకి ఉంచుతాయి. ఎందుకంటే అవి శ్వాస తీసుకోకుండా నీటిలోపల ఉండలేవు.


అతిగా నవ్వితే ప్రమాదమే. పగలబడి నవ్వితే హార్ట్ ఎటాక్ రాగలదు లేదా ఊపిరి ఆడని పరిస్థితి రాగలదు. అందువల్ల కడుపుబ్బ నవ్వకుండా చూసుకోవాలి.


టై కట్టుకోవడం వల్ల బ్రెయిన్‌కి సప్లై అయ్యే బ్లడ్ 7.5 పర్సెంట్ తగ్గుతుంది. దీనిపై 2018లో ఓ పరిశోధన జరిగింది. దాని ప్రకారం టై కట్టుకోవడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. మెడ దగ్గర బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. టైని టైట్‌గా కట్టుకుంటే, వికారంగా ఉంటుంది, కళ్లు మసకబారతాయి, తరచూ తలనొప్పి కూడా వస్తుంది.

 


17, ఏప్రిల్ 2024, బుధవారం

Why don't trees grow on mountains? - పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?

 


భూమిపై ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తాయి. నీరు లేని ఎడారుల్లో కూడా రకరకాల చెట్లను చూస్తుంటాం. కానీ పర్వతాలపై చెట్లు కనిపించవు? ఎందుకిలా? అక్కడ నీరు ఉన్నా.. చెట్లెందుకు పెరగవు?


అత్యంత ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు పెద్దగా పెరగక పోవడానికి ప్రధాన కారణం అక్కడి తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. చెట్లు పెరగాలంటే నీరు కావాలి. భూమిపై ఉండే చెట్లు.. భూగర్భజలాలను వేర్ల ద్వారా తీసుకుంటాయి. పర్వతాలు ఎత్తుగా ఉంటాయి కాబట్టి.. అక్కడ భూగర్భ జలాలు లభించవు. ఒకవేళ లభించినా అవి గడ్డకట్టి ఉంటాయి. అదే సమయంలో పర్వతాలపై ఉండే మంచు, నీరు లాగా మారదు. అది కూడా గడ్డకట్టి ఉంటుంది కాబట్టి.. దాన్ని చెట్లు, నీరు లాగా తీసుకోలేవు. ఈ పరిస్థితుల్లో చెట్లు క్రమంగా ఎండిపోతాయి. 


మరో కారణం కూడా ఉంది. వాతావరణం బాగా చల్లబడినప్పుడు చెట్లలోపలి నీరు కూడా గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే.. చెట్లలో నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడతాయి. దీనికి తోడు పర్వతాలపై విపరీతమైన, బలమైన చల్లగాలులు వీస్తుంటాయి. ఒక్కోసారి మంచు తుపాను రాగలదు. కొన్నిసార్లు మంచు దిబ్బలు విరిగిపడుతుంటాయి (avalanche). ఇలా చెట్లు పెరిగేందుకు వాతావరణం ఏమాత్రం అనుకూలంగా ఉండదు.


వాతావరణం ఎలా ఉన్నా.. పర్వతాలపై కూడా కొన్ని జాతుల చెట్లు పెరగగలవు. పైన్, అశోకా, రెడ్‌వుడ్స్, సర్వి, సెడార్స్, స్ప్రూసెస్, కౌరీస్, హెమ్‌లాక్స్, డగ్లాస్ ఫర్స్, లార్చెస్, యూస్ వంటి చెట్లు పర్వతాలపై కూడా పెరుగుతాయి. ఇవి వాతావరణాన్ని బట్టీ, తమలో మార్పులు చేసుకుంటాయి. ఇవి నీరు లేకపోయినా చాలా కాలం బతికి ఉండగలవు.


What percentage of gold is in 22 carat jewellery? - 22 క్యారెట్ల నగలలో బంగారం ఎంత శాతం ఉంటుంది?

 


మనందరికీ తెలుసు.. 22 క్యారెట్ల నగలలో బంగారం వంద శాతం ఉండదు అని. మరి ఎంత శాతం ఉంటుంది? అసలు ఈ క్యారెట్ లెక్క ఎందుకు? తెలుసుకుందాం.


ఒకప్పుడు మనల్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలించారు కదా.. అప్పుడు వాళ్లు.. బ్రిటన్ దేశంలో పాటించే తూనికలు-కొలతలను ఇండియాలో ప్రవేశపెట్టారు. క్రమంగా భారతీయులు వాటికి అలవాటుపడ్డారు. క్యారెట్ అనేది కూడా బ్రిటన్ నుంచే వచ్చింది.


ప్రాచీన బ్రిటన్‌లో గ్రెయిన్, క్వార్ట్ అనే కాయిన్లు ఉండేవి. నాలుగు క్వార్ట్‌లు, ఒక గ్రెయిన్‌కి సమానం. అలాగే.. నాలుగు గ్రెయిన్లు చెయ్యాలంటే.. 1 క్యారెట్ బంగారం అవసరం. అప్పట్లో వ్యాపారులు, సంపన్నులూ... బ్రిటన్ రాజుకి నాణేలను ఇవ్వాల్సి వచ్చేది. అది కూడా 24 క్యారెట్ల విలువైనవి. అప్పట్లో రాజుకి ఇచ్చే నాణేలను నాణ్యమైన బంగారంతో చేసేవారు. దాంతో.. 24 క్యారెట్లు అనేది బంగారం స్వచ్ఛతకు ప్రమాణంగా మారింది.

 

ప్రస్తుతం గోల్డ్ కాయిన్స్‌ని స్వచ్ఛమైన బంగారంతో తయారుచేస్తున్నారు. అందువల్ల వీటిని 24 క్యారెట్ల గోల్డ్‌ కింద చెబుతారు. బంగారు నగలను వంద శాతం బంగారంతో చేస్తే, అవి గట్టిగా ఉండవు. అలా నగలను తయారుచెయ్యడం చాలా కష్టం. అందువల్ల నగల తయారీలో కొంత రాగి లేదా వెండిని కలుపుతారు. అందువల్ల వాటి స్వచ్ఛత 24 క్యారెట్లు ఉండదు. రాగి లేదా వెండిని ఎంత శాతం కలిపారు అన్న దాన్ని బట్టీ వాటి క్యారెట్ విలువను చూపిస్తారు.


సాధారణంగా నగలను 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 12 క్యారెట్లలో తయారుచేస్తారు. అంటే.. 22 క్యారెట్ల బంగారు నగలలో బంగారం 91.67 శాతం ఉంటుంది. వెండి లేదా రాగి 8.33 శాతం ఉంటుంది. అదే... 18 క్యారెట్ల నగలలో బంగారం 75 శాతం ఉంటే, మిగతావి 25 శాతం ఉంటాయి. అలాగే 12 క్యారెట్ల నగలలో బంగారం 50 శాతం ఉంటుంది. మిగతావి 50 శాతం ఉంటాయి. 



15, ఏప్రిల్ 2024, సోమవారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 6

 


న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. ఒకప్పుడు లైట్ హౌస్ లాగా పనిచేసేది. దాన్ని 1886లో ఆవిష్కరించిన నెల తర్వాత.. దాని టార్చ్‌ని ఆన్ చేశారు. అప్పటి నుంచి 16 ఏళ్లపాటూ అది లైట్‌హౌస్ లాగా పనిచేసింది. ఆ టార్చ్ రాత్రివేళ 38 కిలోమీటర్ల దూరం వరకూ కనిపించేది.


ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో మొత్తం 26 లెటర్స్ ఉంటాయని మనకు తెలుసు. ఐతే.. 1524 వరకూ.. 25 లెటర్సే ఉండేవి. ఆ తర్వాత చివరి లెటర్‌గా Jని యాడ్ చేశారు. అప్పటివరకూ Jకి బదులుగా I లెటర్‌నే వాడేవారు. ఆ తర్వాత J అవసరాన్ని గుర్తించి, దాన్ని యాడ్ చేశారు. ఐతే, J  తర్వాత మరే లెటర్‌నీ యాడ్ చెయ్యలేదు. 


రొయ్య గుండె దాని తలలో ఉంటుంది. రొయ్యలకు ధమనులు ఉండవు. అందువల్ల వాటి అవయవాలు రక్తంలో తేలుతూ ఉంటాయి. 


పందులు ఆకాశంవైపు చూడలేవు. ఎందుకంటే, వాటి మెడ కండరాలు, వెన్నెముక, తల పైకి ఎత్తేందుకు వీలుగా ఉండవు. అందువల్ల పందులు పైకి చూడలేవు.


వేలి ముద్రలు ఎలాగైతే ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయో, నాలిక ముద్రలు కూడా అలా వేర్వేరుగా ఉంటాయి. కవలలకు కూడా టంగ్ ప్రింట్స్ వేరుగానే ఉంటాయి. నాలిక కలర్, షేప్, సర్ఫేస్ ఫీచర్స్ ఇవన్నీ ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఫోరెన్సిక్ పరీక్షల్లో నాలిక ముద్రలను కూడా పరీక్షిస్తారు.


ప్రతీ సంవత్సరం పిడుగుల వల్ల మనుషుల కంటే జిరాఫీలు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి. వాటి మరణాల రేటు మనుషుల మరణాల కంటే 30 రెట్లు ఎక్కువగా ఉంది. వర్షాలు పడే సమయంలో జిరాఫీలు మనలా ఇళ్లలో ఉండే వీలు లేకపోవడం వల్ల, అవి చెట్ల కిందకు వెళ్తున్నాయి. అక్కడే పిడుగులు పడుతుండటం వల్ల చనిపోతున్నాయి. బీబీసీ సైన్స్ ఫోకస్ ఈ విషయాన్ని తెలిపింది.


ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఐతే.. దాని బ్రెయిన్ మాత్రం చాలా చిన్నది. దాని బ్రెయిన్ కంటే, దాని కన్ను పెద్దగా ఉంటుంది. మరో విశేషం ఏంటంటే.. భూమిపై ఉన్న ప్రాణుల్లో అతి పెద్ద కళ్లను కలిగినవి ఆస్ట్రిచ్‌లే. ఈ కళ్లు 5 సెంటీమీటర్లు ఉంటాయి. ఇవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరాయి.


13, ఏప్రిల్ 2024, శనివారం

Why do we fall asleep while reading? - చదివేటప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది?


స్కూల్లో అయినా, లైబ్రరీలో అయినా.. ఎక్కడైనా సరే.. చదివేటప్పుడు చాలా మందికి నిద్ర వస్తుంది. ఎంత ప్రయత్నించినా అది ఆగదు. బుక్ ఓపెన్ చెయ్యగానే నిద్ర మొదలవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? తెలుసుకుందాం.


ఎవరైతే ప్రశాంతంగా కూర్చొని, సైలెంటుగా చదువుతూ ఉంటారో, వారికి బుక్ ఓపెన్ చేసిన పావు గంట తర్వాత నుంచి నిద్ర రావడం మొదలవుతుంది. దీనికి కారణం.. చదివేటప్పుడు వారి శరీర కదలికలు తగ్గిపోతాయి. కళ్లు, బ్రెయిన్, చేతులు మాత్రమే పనిచేస్తుంటాయి. అందువల్ల శరీరంలోని కండరాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. అప్పుడు కండరాల్లోని కణాల్లో దహనచర్య (Combustion) కూడా తగ్గిపోతుంది. అందువల్ల లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ యాసిడ్.. ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. ఈ కారణంగా.. రక్తంలో ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. అందువల్ల శరీరానికి ఆక్సిజన్ తక్కువగా ఉండే రక్తం సప్లై అవుతూ ఉంటుంది.


శరీరానికి కావాల్సిన మొత్తం ఆక్సిజన్‌లో దాదాపు 20 శాతం ఆక్సిజన్ బ్రెయిన్ తీసుకుంటుంది. ఐతే.. లాక్టిక్ యాసిడ్ వల్ల.. బ్రెయిన్‌కి వెళ్లే రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. దాంతో బ్రెయిన్ యాక్టివ్‌గా పని చెయ్యలేదు. అప్పుడే నిద్ర రావడం మొదలవుతుంది. ఇలా కంటిన్యూగా బ్రెయిన్‌కి ఆక్సిజన్ తక్కువగా వస్తున్నంతసేపూ.. బ్రెయిన్ మొద్దుబారినట్లుగానే ఉంటుంది. అందుకే చదివేటప్పుడు నిద్ర మొదలైతే, ఆగదు.


చదివేటప్పుడు నిద్ర రాకూడదంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. చదివేటప్పుడు ఒకే యాంగిల్‌లో ఉండకుండా.. తరచుగా అటూ ఇటూ కదులుతూ ఉండాలి. అలాగే.. పావుగంటకోసారి బ్రేక్ ఇచ్చి.. ఓ నాలుగడుగులు వేసి.. మళ్లీ వచ్చి కూర్చొని చదువుకోవాలి. అంటే.. బాడీకి రెస్ట్ ఇవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు ఎంతసేపు చదివినా, నిద్ర రాదు.


ఇది చదువుకే కాదు.. ఆఫీసుల్లో డెస్క్ వర్క్ చేసేవారికీ వర్తిస్తుంది. ఎక్కువసేపు కూర్చొని పని చేస్తూ ఉంటే, నిద్రవస్తుంది. అందువల్ల వారు కూడా మధ్యమధ్యలో పనికి బ్రేక్ ఇచ్చి.. శరీరం, కండరాలూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకుంటే.. నిద్రకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


Why electric train does not shock? - ఎలక్ట్రిక్‌ ట్రైన్ ఎందుకు షాక్‌ కొట్టదు?

 


భారతీయ రైల్వేలోని చాలా రైళ్లు, మెట్రోరైళ్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లూ ఇవన్నీ ఎలక్ట్రిక్‌వే.. వీటిలో చాలా భాగం ఐరన్ తోనే తయారవుతుంది. అలాంటప్పుడు వీటిలో ప్రయాణించేవారికి కరెంటు షాక్ కొట్టాలి కదా? అలా ఎందుకు జరగట్లేదు? ఈ రైళ్లు మనకు సేఫేనా? తెలుసుకుందాం.


కరెంటులో ధనావేశం, రుణావేశం ఉంటుంది. వాటినే ప్లస్, మైనస్‌గా చెప్పుకుంటాం. ఇవి రెండూ, రెండు పోల్స్ లాంటివి. ఎప్పుడైనా కరెంటు ప్రవహించాలంటే.. అది తప్పనిసరిగా ఈ రెండు పోల్స్‌నీ టచ్ చెయ్యాలి. మనకు షాక్ కొట్టాలంటే.. మన బాడీ.. కొంత దూరంలో ఉన్న ప్లస్, మైనస్‌కి కనెక్ట్ అవ్వాలి. అంటే మనం ఒక చేత్తో ప్లస్‌ పోల్‌ని టచ్ చేస్తే, మరో చేత్తో లేదా కాలితో మైనస్ పోల్‌ని ముట్టుకోవాలి. అప్పుడు మాత్రమే కరెంటు మన బాడీలో ప్రవహిస్తుంది. 


ఒక్కోసారి మనం కరెంటు తీగను ముట్టుకున్నప్పుడు మనకు షాక్ కొడుతుంది. ఎందుకంటే.. భూమిపై ఉండే వాతావరణం ప్లస్ పోల్ లాంటిది. భూమి ఉపరితలం మైనస్ పోల్ లాంటిది. మనం కరెంటు తీగను ముట్టుకున్నప్పుడు.. మనకు ప్లస్ టచ్ అవుతుంది. అదే సమయంలో మన కాళ్లు భూమిని తాకి ఉంటే, అది మైనస్ అవుతుంది. అంటే.. కరెంటుకి ప్లస్, మైనస్ రెండూ దొరికినట్లే.. దాంతో ప్రవాహం సాధ్యమవుతుంది. అప్పుడు మన శరీరం నుంచి కరెంటు ప్రవహిస్తుంది. దాంతో మనకు షాక్ కొడుతుంది.


ఎలక్ట్రిక్‌ ట్రైన్‌లో ఇంజిన్‌‌ని మాత్రమే ఎలక్ట్రిక్‌ వైర్లకు కనెక్ట్ చేస్తారు. బోగీలను కనెక్ట్ చెయ్యరు. ఐతే.. ఇంజిన్‌కీ, బోగీలకూ మధ్య లింక్ ఉంటుంది కాబట్టి, బోగీల్లో కూడా కరెంటు ప్రవహిస్తుంది కదా అనే డౌట్ మనకు రావచ్చు. అది నిజమే. బోగీల్లో కూడా కరెంటు ప్రవహించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడో టెక్నిక్ ఉంది. రైలు ఇంజిన్, బోగీలు అన్నింటికీ ప్లస్ మాత్రమే ఉంటుంది. మైనస్ ఉండదు. రైలు పైన ఉండే కరెంటు తీగ.. ప్లస్ అన్నమాట. మైనస్ అనేది భూమి ఉపరితలం. అందువల్ల పై నుంచి వచ్చే కరెంటును డైరెక్టుగా పట్టాల నుంచి భూమికి కనెక్ట్ అయ్యేలా చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెషిన్ ఉంటుంది. అందువల్ల కరెంటు ప్రవాహం ఆ యంత్రం ద్వారా సాగుతుంది.


కరెంటు ప్రవాహం ఆ మెషిన్ ద్వారానే ఎందుకు వెళ్తుంది? బోగీల వైపు కూడా వెళ్లొచ్చు కదా... అనే మరో డౌట్ మనకు రావచ్చు. ఇక్కడ మరో టెక్నిక్ ఉంది. కరెంట్ ఎప్పుడూ వీలైనంత వేగంగా వెళ్లే మార్గాన్ని వెతుక్కుంటుంది. అంటే.. ప్రవాహంలో ఎలాంటి అవరోధాలూ ఉండకుండా చూసుకుంటుంది. రైల్లోని మెషిన్.. కరెంటును వేగంగా భూమికి చేరేలా చేస్తుంది. ఆ మార్గం కాకుండా మరే మార్గంలో వెళ్లినా ఆలస్యం అవుతుంది. అందువల్ల కరెంటు ఆ యంత్రం ద్వారానే వెళ్తుంది. ఈ కారణంగా రైలులో ఉన్నవారికి కరెంటు పాస్ అవ్వదు. అందుకే ఎలక్ట్రిక్ రైలులో ప్రయాణించేవారికి షాక్ కొట్టదు.


Strange Facts - వింతలు - విచిత్రాలు - 5


పులులకు ఉండే నల్లటి చారలు.. బొచ్చుపై మాత్రమే కాదు.. చర్మంపై కూడా ఉంటాయి. ఇవి దాదాపు వేలి ముద్రల లాంటివి. ఎందుకంటే, ఏ రెండు పులులకూ ఒకే రకమైన చారలు ఉండవు. ఈ చారలు రాత్రివేళ వేటాడేందుకు పులికి ఉపయోగపడతాయి. చారల కారణంగా పులి గడ్డిలో వెళ్తున్నప్పుడు.. అది గడ్డిలో కలిసిపోతుంది. దాంతో పులికి వేటాడటం తేలికవుతుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌కి చెందిన నేచర్ స్టడీ సొసైటీ నిర్ధారించింది. 


మనకు మామూలు సమయంలో కంటే, స్నానం చేసేటప్పుడు క్రియేటివ్ ఐడియాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే, మన శరీరంపై గోరు వెచ్చని నీరు పడినప్పుడు.. శరీరంలో డోపమైన్ (Dopamine) అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మన మూడ్‌ని మార్చగలదు. దీని కారణంగా మనుషులు మరింత క్రియేటివ్‌గా ఆలోచిస్తారు.


హెడ్‌ఫోన్స్ వల్ల మన చెవిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఎవరైనా ఒక గంట పాటూ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే, వారి చెవిలో బ్యా్క్టీరియా 700 రెట్లు పెరుగుతుంది. అందుకే వీలైనంవరకూ హెడ్‌ఫోన్స్ వాడకపోవడం మేలని పరిశోధకులు చెబుతున్నారు.


చందమామ కంటే ఆస్ట్రేలియా వైశాల్యం ఎక్కువ. చందమామ వైశాల్యం 3,400 కిలోమీటర్లు. ఆస్ట్రేలియా వైశాల్యం తూర్పు నుంచి పడమరకు 4వేల కిలోమీటర్లు.


మన శరీరంలో ఏదైనా అవయవం పాడైతే, అది వీలైనంతవరకూ తనకు తానుగా చికిత్స చేసుకుంటుంది. ఇలా బాడీలోని అన్ని అవయవాలూ ప్రయత్నిస్తాయి. ఒక్క నోట్లోని దంతాలు మాత్రం అలా చెయ్యవు. కారణం వీటిలో సజీవ కణజాలం ఉండదు. పైగా దంతాలపై ఎనామెల్ పొర ఉంటుంది. అది పాడైతే, తిరిగి ఉత్పత్తి కాలేదు.


బిర్యానీలో వాడే జాజికాయలు (nutmeg) ఒక రకంగా మత్తుపదార్థం లాంటివి. ఎందుకంటే వాటిలో మిరిస్టిసిన్ (myristicin) అనే సహజమైన కాంపౌండ్ ఉంటుంది. ఇది బ్రెయిన్‌ మొద్దుబారేలా చెయ్యగలదు. ఎవరైనా జాజికాయలను ఎక్కువగా వాడితే, వారికి మతి భ్రమిస్తుంది. మత్తు వస్తుంది. ఈ విషయాన్ని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్శిటీ చెప్పింది.


అన్ని గ్రహాలూ యాంటీ-క్లాక్‌వైజ్ తిరుగుతుంటే, శుక్రగ్రహం మాత్రం క్లాక్‌వైజ్ తిరుగుతుంది. ఐతే.. భూమి తనచుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడితే, వీనస్‌ తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. ఐతే.. అది సూర్యుడి చుట్టూ తిరగడానికి 225 రోజులే పడుతుంది. ఇలా ఈ గ్రహం ఒకసారి తన చుట్టూ తాను తిరిగేలోపే, సూర్యుడి చుట్టూ భ్రమణం పూర్తి చేస్తుంది. ఇలా ఎందుకంటే, గ్రహాలు ఏర్పడిన సమయంలో శుక్రగ్రహం కూడా యాంటీ-క్లాక్‌వైజ్ తిరుగుతూ ఉంటే, మరో గ్రహమో లేక గ్రహశకలమో శుక్రగ్రహాన్ని కుడివైపు నుంచి ఎడమవైపుకి ఢీకొడుతూ వెళ్లి ఉండొచ్చనీ, దాంతో అప్పటినుంచి అది రివర్సులో తిరగడం మొదలుపెట్టి ఉండొచ్చనే అంచనా ఉంది. అందువల్లే అది నెమ్మదిగా తిరుగుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 


10, ఏప్రిల్ 2024, బుధవారం

Which side to sleep on? - ఏ దిక్కువైపు పడుకోవాలి?

 


మనం ఏ దిక్కువైపు పడుకుంటే మంచిది? అనే ప్రశ్న మనలో చాలా మందికి ఉంటుంది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల సమాధానాలు మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తాయి. సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం.


నిద్ర అనగానే.. చాలా మంది వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుంటారు. వాస్తు ప్రకారం.. తూర్పు లేదా దక్షిణంవైపు తల పెట్టుకొని పడుకోవాలి. కాళ్లు పశ్చిమం లేదా ఉత్తరం వైపు ఉండాలి. అలా వీలు కాకపోతే.. తల పశ్చిమం లేదా ఈశాన్యం వైపు ఉండొచ్చు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఈ నియమాలు పాటిస్తారు.


జపాన్‌లో కొంతమంది ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ నిద్రపోరు. ఎందుకంటే జపాన్‌లో చనిపోయిన వారి తలలు, ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు. అలాగే ఆఫ్రికాలో చనిపోయిన వారి తలలు పశ్చిమంవైపు చూస్తున్నట్లు ఉంచుతారు. అందుకని జపనీస్ అలా నిద్రపోరు, అది వారి నమ్మకం.


సైన్స్ ప్రకారం చూస్తే.. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి.. ఉత్తరం లేదా దక్షిణంవైపు తలపెట్టుకొని పడుకోకూడదు అని కొంతమంది శాస్త్రవేత్తలు గతంలో నమ్మేవారు. ఆధునిక కాలంలో.. దీనిపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటి ప్రకారం.. భూమి గ్రావిటీ పవర్.. మనపై ఎప్పుడూ ఉంటుంది. నిద్రపోయినా, మెలకువగా ఉన్నా.. అది నిరంతరం ఉంటుంది. అందువల్ల, నిద్రకీ, పడుకునే విధానానికీ, గురుత్వాకర్షణ శక్తి ప్రభావానికీ సంబంధం లేదు. 


మనం ఏ దిక్కున పడుకున్నా.. మన శరీరం నుంచి అయస్కాంత క్షేత్ర రేఖలు వెళ్తూనే ఉంటాయి. మన శరీరంలో సుమారు 20 మిల్లీగ్రాముల దాకా మాంగనీస్ ఉంటుంది. అలాగే సుమారు 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. మనం ఏ దిక్కున పడుకున్నా.. అయస్కాంత క్షేత్ర ప్రభావం మనపై ఒకేలా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకూ.. భూ అయస్కాంత క్షేత్రానికి తగినట్లుగానే మన శరీరం నడుచుకుంటుంది. అందువల్ల మనం ఏ దిక్కున పడుకున్నా.. ఏ సమస్యా ఉండదని మోడ్రన్ సైంటిస్టులు చెబుతున్నారు. కంఫర్ట్‌గా నిద్రపోవడం ముఖ్యం అని అంటున్నారు.


9, ఏప్రిల్ 2024, మంగళవారం

History of Potato - బంగాళాదుంపల్ని విషంలా చూసేవారు!

 


ఈ రోజుల్లో బంగాళాదుంపలు లేని ఇల్లు దాదాపు ఉండదు. కూరల్లో, బజ్జీలలో, చిప్స్ లాగా ఇలా ఎన్నో రకాలుగా ఆలూని వండుకోవచ్చు. అలాంటి ఈ దుంపలను ఒకప్పుడు విషంలా చూసేవారు. ఆలూ చరిత్ర తెలుసుకుందాం.


బంగాళాదుంపలు పుట్టింది దక్షిణ అమెరికాలో. వీటిలో 4000 రకాలు ఉన్నాయి. ఇవి ఎల్లో, రెడ్, బ్లూ, బ్లాక్ ఇలా చాలా రంగుల్లో ఉన్నాయి. అంతేకాదు.. వీటిలో చిన్న దుంపలు బఠాణీ గింజ సైజులో ఉంటాయి. పెద్ద దుంపలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలు.. బియ్యం, గోధుమలు, మొక్కజొన్నతోపాటూ.. దుంపలను ఎక్కువగా తింటున్నారు.


క్రీస్తుపూర్వం 3వేల సంవత్సరాల కాలంలో దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతంలో 'ఇన్కా ఇండియన్లు' నివసించేవారు. వారే తొలిసారి బంగాళాదుంపలను పండించారని చెబుతారు. క్రీస్తు శకం 1537లో స్పెయిన్ దేశస్థుల ద్వారా ఈ దుంపలు యూరప్‌ దేశాలకు చేరాయి. ఐతే.. మొదట్లో యూరోపియన్లు దుంపలు తింటే చనిపోతారని అనుకునేవారు. వాటిని విషంలా చూసేవారు.


జర్మనీ రాజు ఫ్రెడెరిక్‌ విలియం ఈ దుంపల గురించి ఆరా తీశారు. అప్పుడు ఈ దుంపల్లో ఉండే పోషకాల గురించి తెలుసుకున్నారు. వాటిని పండించమని ఆదేశించారు. అలా యూరప్‌లో దుంపల వాడకం పెరిగింది. ఆ తర్వాత ఈ దుంపలు.. 1621లో ఉత్తర అమెరికాకీ, 1719లో ఇంగ్లాండుకీ పరిచయం అయ్యాయి. వీటిని 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు భారత్‌కి పరిచయం చేశారు.


బంగాళాదుంపలో 80 శాతం నీరే ఉంటుంది. ఇంకా ప్రోటీన్, సోడియం, పొటాషియం, ఫైబర్, నియాసిన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సీ ఉంటాయి. ఒక అమెరికన్‌ ఏడాదికి 54 కేజీల దుంపల్ని తింటుంటే, ఒక జర్మన్ సంవత్సరానికి 65 కేజీల దుంపలు లాగిస్తున్నారు. అదే ఒక ఇండియన్ ఏడాదికి 33 కేజీల దుంపలే తింటున్నారు. ప్రపంచంలో బంగాళాదుంపల్ని ఎక్కువగా పండిస్తున్న దేశాల్లో చైనా, భారత్, రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ టాప్‌లో ఉన్నాయి.


Strange Facts - వింతలు - విచిత్రాలు - 4


పెళ్లి ఉంగరాన్ని రోజూ ధరిస్తే, సంవత్సర కాలంలో అది 6 మిల్లీ గ్రాములు తగ్గిపోతుంది. ఈ లెక్కన ఆ ఉంగరం 1 గ్రాము బరువు తగ్గాలంటే, 165 సంవత్సరాలకు పైగా పడుతుంది. 


గుడ్లగూబ, ఊసరవెల్లి, నీటి ఏనుగు.. ఒకేసారి రెండు దిక్కులను చూడగలవు. అంటే.. మనం ఒకేసారి రెండు కళ్లతో ఒకే దృశ్యాన్ని చూస్తాం. కానీ ఈ మూడూ మాత్రం.. రెండు కళ్లతో ఒకేసారి వేర్వేరు దృశ్యాలను చూడగలవు. అందుకు వీలుగా వీటి కనుగుడ్లు.. వేర్వేరుగా కదలగలవు. 


ఈ ప్రపంచంలో అంతటా బ్యాక్టీరియా, వైరస్ ఉన్నాయి. ఒక లీటర్ సముద్ర నీటిలో 100 కోట్ల బ్యాక్టీరియా, 1000 కోట్ల వైరస్‌లు ఉంటాయని అంచనా. ఇవి లీటర్ నీటిలో 20వేల రకాలవి ఉంటాయని అంచనా.


ఏనుగు, జిరాఫీ రోజూ 2 నుంచి 4 గంటలే నిద్రపోతాయి. గబ్బిలాలు రోజూ 18 నుంచి 20 గంటలు నిద్రపోతాయి. 


ఆస్ట్రేలియాకి చెందిన ఈము పక్షులు గంటకు 45 కిలోమీటర్లు పరుగెత్తగలవు. కానీ ఇవి వెనక్కి నడవలేవు. ఆస్ట్రిచ్ తర్వాత పెద్ద పక్షులు ఇవే. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే ఈ పక్షులు వీలైనంతవరకూ మనుషులకు దూరంగా.. అడవుల్లో జీవిస్తాయి.


మన గుండె నిమిషానికి 72సార్లు కొట్టుకుంటుందని మనకు తెలుసు. తాబేలు గుండె నిమిషానికి 13సార్లే కొట్టుకుంటుంది. శరీరము చిన్నదైనకొద్దీ హార్ట్ బీట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఒంటె గుండె నిమిషానికి 35 సార్లు కొట్టుకుంటే.. ఎలుక గుండె 400 సార్లు కొట్టుకుంటుంది.


భూమిపై నుంచి మనం ఎప్పుడూ ప్రస్తుత సూర్యుణ్ని చూడలేం. మనం ఎప్పుడు సూర్యుణ్ని చూసినా అది గత సూర్యుడే అవుతుంది. అంటే 8 నిమిషాల ముందు ఉన్న సూర్యుడి రూపం అవుతుంది. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. కాబట్టి మనం భూమిపై నుంచి 8 నిమిషాల ముందు ఉన్న సూర్యుణ్ని మాత్రమే చూడగలం. మరోలా చెప్పాలంటే.. మనం వర్తమానంలో ఉండి.. గతాన్ని చూస్తాం.



8, ఏప్రిల్ 2024, సోమవారం

How to make electricity from coal? - బొగ్గుతో కరెంట్ ఎలా తయారుచేస్తారు?


బొగ్గు నల్లగా ఉంటుంది. దాన్ని మనం రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం. ఐతే.. ఆ బొగ్గుతో కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు అనే డౌట్ మనకు ఉంటుంది. ఆ ప్రక్రియ తెలుసుకుందాం.


పెట్రోల్, డీజిల్ ఎలాంటిదో బొగ్గు కూడా అలాంటిదే. అంటే.. ఇది ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువగా కెమికల్ ఎనర్జీ ఉంటుంది. ఆ కెమికల్ ఎనర్జీని వాడుకొని.. ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. ఈ పని థెర్మల్ పవర్ స్టేషన్లలో జరుగుతుంది. ఇండియాలోని NTPC, KTPS, RTPP, STPP వంటి వాటిలో ఇదే జరుగుతుంది.


గనుల్లో దొరికే బొగ్గు క్లీన్‌గా ఉండదు. అందువల్ల దాన్ని ముందుగా క్లీన్ చేస్తారు. తర్వాత ఎండబెడతారు. తడి పోయిన తర్వాత ఆ బొగ్గును థెర్మల్ పవర్ స్టేషన్లలో మండిస్తారు. ఇలా మండించినప్పుడు, ఆ వేడి నుంచి నీరు, ఆవిరి రూపంలో వస్తుంది. ఈ ఆవిరిపై విపరీతమైన ప్రెషర్ పెట్టి.. గొట్టాల ద్వారా వెళ్లేలా చేస్తారు. గొట్టాల చివర టర్బైన్లు ఉంటాయి. నీటి ఆవిరి వేగంగా వెళ్లడంతో టర్బైన్లపై ప్రెషర్ ఏర్పడి అవి గిరగిరా తిరుగుతాయి.


టర్బైనులో విద్యుత్ అయస్కాంత స్తూపం ఉంటుంది. ఈ పిల్లర్.. సెకండ్‌కి 50 సార్లు తిరుగుతుంది. ఈ టర్బైన్‌లో ఉన్న అయస్కాంత క్షేత్రంలో కరెంటు తీగలు ఉంటాయి. టర్బైన్ తిరిగినప్పుడు ఈ తీగలు కదులుతాయి. ఫారడే సూత్రం ప్రకారం.. తీగలు కదిలినప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC) పుడుతుంది. ఇలా బొగ్గును ఇంధనంలా వాడి, టర్బైన్లు తిరిగేలా చేసి, తద్వారా కరెంటు ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. 


7, ఏప్రిల్ 2024, ఆదివారం

Why won't the horse sit? - గుర్రం ఎందుకు కూర్చోదు?

 


ఈ ప్రకృతికి ఓ ధర్మం ఉంది. అది ఏ జీవికైనా.. అవసరమైనంతవరకే అవయవాల్ని ఇస్తుంది. అదనంగా ఏదీ ఇవ్వదు. ఉదాహరణకు మనుషులనే తీసుకుంటే, మనకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మనకు ఎగరాల్సిన అవసరం లేదు. తప్పనిసరై ఎగరాలి అనుకుంటే.. అందుకు కావాల్సిన తెలివితేటలు మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చాయి. మన చేతికి 5 వేళ్లు ఉంటాయి. వాటిలో ఒకటి తక్కువైనా సమస్యే, ఒకటి ఎక్కువగా ఉన్నా సమస్యే. అదనపు వేలు వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. 


చేపలు మాట్లాడలేవు. ఒకవేళ మాట్లాడినా నీటిలో ఆ మాటలు ఇతర చేపలకు సరిగా వినిపించవు. అందువల్ల ప్రకృతి వాటికి మాటలు ఇవ్వలేదు. మాటలతో వాటికి పనిలేదు. పాముకి కాళ్లు లేవు. అయినా అది వేగంగా వెళ్లేలా ఏర్పాటు ఉంది. తాబేలుకి డిప్ప, జిరాఫీకి పొడవైన మెడ, గబ్బిలానికి ధ్వని తరంగాలు, గద్దకు శక్తిమంతమైన చూపు, ఇలా ఈ సృష్టిలో ప్రతీ జీవీ.. తనకు ఉన్న ప్రత్యేకతలతో హాయిగా జీవించేలా ఏర్పాట్లు ఉన్నాయి. గుర్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది.


మన ఇళ్ల దగ్గర ఆవు, గేదె, మేక లాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లనీ ముడుచుకుని కూర్చోవడం చూస్తుంటాం. ఒంటె, ఏనుగు లాంటి పెద్ద జంతువులు నేలపై కూర్చొని సేద తీరుతాయి. తద్వారా వాటి కాళ్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. కానీ గుర్రానికి అలా కూర్చోవాల్సిన అవసరం లేదు.


వేగంగా పరుగెత్తగల జంతువుగా గుర్రం ఫేమస్. హార్స్ రేసుల్లో గుర్రాలు దూసుకెళ్తాయి. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి గుర్రం సొంతం. అందుకు కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండటమే. 


గుర్రం మూడు కాళ్లపై కూడా నిలబడగలదు. తద్వారా అది ఒక కాలుకి విశ్రాంతి ఇవ్వగలదు. అలా అది వన్ బై వన్ కాళ్లకు విశ్రాంతి ఇస్తుంది. దాంతో కూర్చోవాల్సిన అవసరం లేకుండానే కాళ్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. గుర్రం నిలబడి నిద్రపోగలదు కూడా. కొన్ని సందర్భాల్లో మాత్రం హార్స్ పూర్తిగా పక్కకు ఒరిగి నిద్రపోతుంది. ఇలా ఈ సృష్టి గుర్రానికి ఈ ప్రత్యేకతను ఇచ్చింది.



5, ఏప్రిల్ 2024, శుక్రవారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 3

 


సముద్రం నీరు ఉప్పగా ఉంటుందని మనకు తెలుసు. ఆ నీటిని తెచ్చి, ఫ్రిజ్‌లో పెట్టి గడ్డకట్టిస్తే, ఆ తర్వాత గడ్డలను కరిగిస్తే వచ్చే నీరు ఉప్పగా కాకుండా మామూలుగా ఉంటుంది. దీన్నే బ్రిన్ రిజెక్షన్ (Brine rejection) అంటారు. నీరు గడ్డకట్టేటప్పుడు క్రిస్టల్ ఆకారంలోకి మారుతుంది. ఇలాంటి ఆకారంలోకి ఉప్పు మారలేదు. అందువల్ల ఉప్పు.. ఆ ఐస్ క్యూబ్ లో ఉండదు. అందువల్ల ఐస్ క్యూబ్ కరిగిన తర్వాత.. ఆ నీరు సాల్టీగా ఉండదు.


క్లౌన్ చేపలు ఆడవి, మగవిగా, మగ చేపలు ఆడవిగా మారగలవు. ఇది ఈ చేపల్లో ప్రత్యేకత. ఈ చేపల్లో 30 రకాల జాతులను గుర్తించారు. ఇవి ఎల్లో, ఆరెంజ్, రెడ్డిష్, బ్లాకిష్ కలర్స్‌లో ఉంటాయి. ఇవి 18 సెంటీమీటర్ల వరకూ పెరుగుతాయి.


ఖండాలు సంవత్సరానికి 2 సెంటీమీటర్లు కదులుతున్నాయి. భారత ఉపఖండం మాత్రం సంవత్సరానికి 5 సెంటీమీటర్లు కదులుతోంది. ఇది ఆగ్నేయ దిశగా కదులుతోంది. అందువల్ల నార్త్ ఈస్ట్ ఇండియా చైనాలోకి చొచ్చుకెళ్తోంది. 


శరీరంలో 1 కేజీ కొవ్వు, 7,700 కేలరీల ఎనర్జీ కలిగివుంటుంది. ఈ లెక్కన బరువు తగ్గాలి అనుకునేవారు.. 1 కేజీ బరువు తగ్గాలంటే.. 7,700 కేలరీలను తగ్గించుకోవాలి. ఐతే.. మగవారికి రోజూ 2500 కేలరీలు అవసరం, మహిళలకు 2000 కేలరీలు అవసరం. వీటిని మెయింటేన్ చేస్తూ, కొవ్వును కరిగించుకుంటే, ఆరోగ్యంగా ఉంటారు.


భారత కరెన్సీ నోటు చిరిగేముందు కనీసం 4000 మంది చేతులు మారుతుందని అంచనా


సాధారణంగా మనం నిమిషానికి 20 సార్లు కనురెప్పలను ఆడిస్తాం. మనకు తెలియకుండానే ఇలా చేస్తాం. ఐతే.. కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు పనిచేసేవారు మాత్రం నిమిషానికి 7 నుంచి 9 సార్లు మాత్రమే కనురెప్పలను ఆడిస్తారు. ఇది కళ్లకు సమస్యే.


కంగారూలు వెనక్కి నడవలేవు. కారణం వాటి కాళ్ల నిర్మాణం వెనక్కి నడిచేందుకు అనుకూలంగా ఉండదు. ఐతే.. కంగారూలు బలమైన కాళ్లు, తోక వల్ల ఒకేసారి 10 అడుగుల వరకూ గెంతగలవు.


4, ఏప్రిల్ 2024, గురువారం

Secret of Eagle vision - గద్ద చూపులో ఎన్నో ప్రత్యేకతలు

 


మన తెలుగు రాష్ట్రాల్లో గద్దలు ఎక్కువగా కనిపించవుగానీ.. కర్ణాటకలో ఎక్కడ చూసినా అవే ఉంటాయి. డేగ చూపు పవర్‌ఫుల్ అని మనకు తెలుసు. దాని ప్రత్యేకతలు తెలుసుకుందాం.


మనుషుల కంటి చూపు కంటే, పక్షుల కంటి చూపులో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గద్దల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు గద్దని గమనిస్తే, దాని కనుగుడ్లు విశాలంగా, పొడవుగా ఉంటాయి. అంటే.. కనుగుడ్డులో కంటి కటకానికీ, రెటీనాకీ మధ్య విశాలమైన ప్రదేశం ఉంటుంది.


మనుషులతో పోల్చితే, పక్షుల రెటీనాలలో జ్ఞాన సంబంధిత జీవ కణాలు (sensory cells) ఎక్కువగా ఉంటాయి. పైగా అవి రెటీనాలో సమానంగా వ్యాపించి ఉంటాయి. అందువల్ల గద్ద పైనుంచి ఎగురుతూ చాలా ఎక్కువ భూవైశాల్యాన్ని చూడగలదు. 


గద్దకు ప్రతీదీ మనకంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మన కంటికి కనిపించని వాటిని కూడా గద్ద చూడగలదు. మనం ఏదైనా చూసినప్పుడు.. ఆ దృశ్యం ప్రతిబింబం.. మన కంటిలో ఏర్పడుతుంది. గద్దకూ ఇలా జరుగుతుంది. కాకపోతే గద్ద కంటిలో ఏర్పడే ప్రతిబింబం చాలా స్పష్టంగా ఉంటుంది. మన కంటిలో కంటే, గద్ద కంటిలో ఈ ప్రతిబింబ కణాలు 8 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే గద్ద దూరంగా ఉండే వాటిపై కూడా అతి త్వరగా దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది.


కంటిలోని ద్రవాల కదలికల వల్ల మనం సెకనుకు 25 ప్రతిబింబాలను చూడగలం. గద్ద సెకనుకు 150 ప్రతిబింబాలను చూడగలుగుతుంది. అంతేకాదు.. మన కంటికి కనిపించని అతినీల లోహిత కిరణాలను (ultra violet rays) గద్ద చూడగలదు. అందువల్ల కోడిపిల్ల రెట్ట వేస్తే, ఆ రెట్ట నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల్ని గద్ద ఆకాశం నుంచి చూస్తుంది. దాంతో.. అక్కడో కోడి పిల్ల ఉన్నట్లు గద్దకు తెలిసిపోతుంది. ఇలా ఈగిల్ ఫోకస్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది.


3, ఏప్రిల్ 2024, బుధవారం

Why cattle ruminate? - పశువులు ఎందుకు నెమరు వేస్తాయి?

 


మన ఇళ్ల దగ్గర మీరు గమనించే ఉంటారు, ఆవులు, గేదెల వంటివి ఆహారం నెమరు వేస్తూ ఉంటాయి. అవి అలా ఎందుకు చేస్తాయో, నెమరు వేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.


మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆది కడుపులోకి వెళ్లిపోతుంది. దాన్ని మనం మళ్లీ పైకి తీసుకురాలేం. అలా తీసుకొస్తే, వామ్టింగ్ అయిపోతుంది. కానీ ఆవులు, గేదెలు, ఎద్దుల వంటి వాటి విషయంలో ఇది భిన్నంగా జరుగుతుంది. అవి తిన్న ఆహారాన్ని మళ్లీ తిరిగి నోటిలోకి తెచ్చుకోగలవు. అలా తెచ్చుకొని, బాగా నములుతాయి. దాన్నే మనం నెమరువేస్తున్నాయి అంటాం. దీనికి ప్రత్యేక కారణం ఉంది.


మనం మనకు కావాల్సిన ఆహారాన్ని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం. తద్వారా ఎప్పుడు ఎంత కావాలంటే అంత తింటాం. కానీ పశువులు అలా స్టాక్ పెట్టుకోలేవు కదా.. అందుకే ప్రకృతి వాటికి ప్రత్యేక ఏర్పాటు ఇచ్చింది. అవి తమ పొట్టలోని జీర్ణాశయంలో ఆహారాన్ని స్టాక్ పెట్టుకుంటాయి. ఎలా అంటే.. వాటి జీర్ణాశయంలో 4 గదులు ఉంటాయి. అక్కడ స్టాక్ ఉంచుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి 3 రోజులు పడుతుంది.


పశువులు పొలానికి వెళ్లినప్పుడు గడ్డి, ఇతర మేతను నమలకుండా డైరెక్టుగా మింగేస్తాయి. ఆ ఆహారం వాటి జీర్ణాశయంలోని మొదటి గది అయిన ర్యూమన్‌ (rumen)లోకి వెళ్తుంది. అక్కడ మెత్తగా అయ్యి, కొంతవరకూ జీర్ణమవుతుంది. జీర్ణం కాని ఆహారాన్ని పశువులు తిరిగి నోట్లోకి తెచ్చుకుంటాయి. దాన్ని బాగా నములుతాయి. మెత్తగా అయ్యేలా చేస్తాయి. అదే నెమరువెయ్యడం అంటే.


నెమరు వేసిన తర్వాత మెత్తబడిన ఆహారం, జీర్ణాశయంలోని రెండో గది అయిన రెటిక్యులమ్‌ (reticulum)లోకి వెళ్తుంది. ఆ తర్వాత మూడో గది అయిన ఒమేసమ్‌ (omasum)లోకి వెళ్తుంది. చివరిగా నాలుగో గది అయిన అబోమేసమ్‌ (abomesum)లోకి వెళ్తుంది. ఆ తర్వాత పూర్తిగా జీర్ణమవుతుంది. ఇలా పశువులకు ప్రకృతి.. ప్రత్యేక ప్రక్రియను ఇచ్చింది.


2, ఏప్రిల్ 2024, మంగళవారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 2


మొసలి నేలపై తిన్నగా మాత్రమే నడవగలదు. పక్కకు తిరిగి నడవడం దానికి చాలా కష్టం. ఎప్పుడైనా మొసలి వెంటపడితే.. తిన్నగా పరుగెత్తకుండా.. అటూ ఇటూ జిగ్‌జాగ్‌గా పరుగెత్తాలి. అప్పుడు మొసలి పట్టుకోలేదు.


మిడతల్లో కొన్ని కలర్స్ మార్చుకోగలవు, మరికొన్ని పరిస్థితులను బట్టీ తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మిడతల కాలి కండరాలు మనిషి కాలి కండరాల కంటే.. దాదాపు 1000 రెట్లు బలంగా ఉంటాయి.


ఆరోగ్యంగా ఉండే మనిషిలో 5 గ్రాముల దాకా ఇనుము ఉంటుంది. ఇందులో సగం ఎర్రరక్త కణాలలోనే ఉంటుంది. ఈ ఇనుముతో 3 అంగుళాల మేకును తయారుచెయ్యవచ్చు.


మనిషి శరీరంలో ఉండే కార్బన్‌తో 900 పెన్సిల్స్ తయారుచెయ్యవచ్చు.


సింహం గర్జన 8 కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది. ఎందుకంటే.. సింహం గర్జన నుంచి 114 డెసిబెల్స్ సౌండ్ వస్తుంది. అదే మనిషి అరుపు నుంచి మాగ్జిమం 65 డెసిబెల్స్ సౌండ్ వస్తుంది. మనం 80 డెసిబెల్స్ వరకూ సేఫ్‌గా వినగలం. ధ్వని అంతకంటే పెరిగితే.. వినడం కష్టమే.


తూనీగలు 30 కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఉన్నాయి. అదే భూమిపై మనిషి పుట్టి 60 లక్షల సంవత్సరాలే అయ్యింది. 


బొద్దింకలు ఆహారం లేకుండా నెల పాటూ జీవించగలవు. నీరు లేకుండా వారం పాటూ ఉండగలవు. అలాగే బొద్దింక నీటిలోపల మునిగివున్నా 15 నిమిషాలపాటు బతికి ఉండగలదు.


బబుల్‌గమ్‌ నమిలేటప్పుడు మన గుండె కొట్టుకునే వేగం మామూలుగా కంటే, కాస్త పెరుగుతుంది. ఎందుకంటే చ్యూయింగ్ గమ్ నమిలేటప్పుడు, 8 దవడ ఎముకలు కదులుతాయి. అది కూడా ఒక రకమైన ఎక్సర్‌సైజ్ లాంటిదే. అందువల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది.


సూర్యుడి చుట్టూ భూమి రోజూ 24 లక్షల కిలోమీటర్లు తిరుగుతోంది. సెకండ్‌కి 29 కిలోమీటర్లకు పైగా వేగంతో భూమి తిరుగుతోంది. అదే మిల్కీ వే గెలాక్సీలో భూమి తిరిగే వేగం సెకండ్‌కి 200 కిలోమీటర్లుగా ఉంది. భూమితోపాటూ సూర్యుడు, ఇతర గ్రహాలు కూడా అదే వేగంతో పాలపుంత గెలాక్సీలో తిరుగుతున్నాయి.


1, ఏప్రిల్ 2024, సోమవారం

Why sweat before rain? - వర్షం వచ్చే ముందు ఉక్కపోత ఎందుకు?

 


సాధారణంగా వర్షం వచ్చే ముందు వాతావరణం చల్లబడుతుంది. చల్లని గాలి వీస్తుంది. పరిసరాలు ఆహ్లాదకరంగా మారతాయి. ఐతే.. ఆ సమయంలో మనకు చెమట పట్టి, ఉక్కగా అనిపిస్తుంది. అలా ఎందుకో తెలుసుకుందాం.


భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఇలా ఎందుకంటే.. చెమట పట్టడం అనేది చర్మం పై భాగంలో కంటిన్యూగా జరిగే ప్రక్రియ. అంటే.. చర్మం కింద ఉండే స్వేద గ్రంధులు.. నిరంతరం చెమటను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆ చెమట.. చర్మం పైభాగానికి నిరంతరం వస్తూనే ఉంటుంది. అది వాతావరణంలోని వేడిని గ్రహించి.. ఆవిరిగా మారి.. గాలిలో కలిసిపోతుంది. వేడి వాతావరణం ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. గాలిలో నీటి శాతం అంటే తేమ ఎంత ఉంది అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.


గాలిలో తేమ తక్కువగా ఉంటే.. చెమట త్వరగా ఆవిరి అవుతుంది. అప్పుడు మనకు ఉక్కగా అనిపించదు. అదే గాలిలో తేమ ఎక్కువగా ఉంటే.. చెమట త్వరగా ఆవిరి అవ్వదు. వర్షం వచ్చే ముందు గాలిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ గాలిలో మరింత నీరు పట్టదు. అందువల్ల చెమట.. గాలిలో ఆవిరి అవ్వదు. అప్పుడు చర్మంపైకి వచ్చే చెమట, ఆవిరి అవ్వకుండా అక్కడే ఉండిపోతుంది. అదే సమయంలో చల్లని తేమ వాతావరణాన్ని తట్టుకునేందుకు శరీరం వేడెక్కుతుంది. దాంతో చర్మంపై చెమట క్రమంగా పెరుగుతూ ఉంటే.. మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపిస్తుంది.


31, మార్చి 2024, ఆదివారం

Wonders of the World - ప్రపంచ వింతలు - 1

 


ఈ ప్రపంచమే ఒక వింత. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో. అలాంటి కొన్ని ఇప్పుడు చెప్పుకుందాం.


మనిషి శరీరంలో ఎన్ని అణువులు ఉంటాయి? 70 కేజీల వ్యక్తి శరీరంలో 7 ఆక్టీలియన్ అణువులు ఉంటాయి. అంటే 7 పక్కన 27 జీరోలు.

7,000,000,000,000,000,000,000,000,000


150ml వైన్ తయారుచెయ్యడానికి కేజీ 130 గ్రాముల ద్రాక్షపండ్లు అవసరం. అందుకే వైన్ ధర ఎక్కువగా ఉంటుంది.


సీతాకోకచిలుకలు ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ అంటార్కిటికాలో లేవు.


ఫేమస్ పెయింటర్ పాబ్లో పికాసో పుట్టినప్పుడు ఏడవలేదు, కదల్లేదు. కనీసం ఊపిరి కూడా తీసుకోలేదు. చనిపోయాడనుకొని నర్సు పక్కన పెట్టింది. ఆ సమయంలో పికాసో తల్లి బంధువైన ఓ డాక్టర్ వచ్చి, సిగరెట్ పొగను పికాసో ముఖంపై ఊదాడు. దాంతో ఒక్కసారిగా కదిలిన పికాసో, ఊపిరి తీసుకొని, ఎడవడం మొదలుపెట్టాడు.


పాయిజన్ ఏరో అనే కప్ప శరీరంలో ఒకేసారి 2200 మందిని చంపగల విషం ఉంటుంది. ఈ కప్పలు దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి.

Poison arrow frog


గోల్డెన్ టార్టాయిస్ బీటిల్, ఊసరవెల్లిలా రంగులు మార్చగలదు. ఇది ఆకులు తింటూ బతుకుతుంది.


యాపిల్స్‌లో 7500 రకాలున్నాయి. ఈ చెట్టు గులాబీ జాతికి చెందినది.


వంకాయల్లో నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సిగరెట్లు, చుట్టలో ఉండే నికోటిన్ లాగానే ఉంటుంది. కానీ ఇది మన శరీరానికి అంతగా హాని చెయ్యదు. 1 సిగరెట్‌లో ఎంత నికోటిన్ ఉంటుందో, అంత నికోటిన్ 9 కేజీల వంకాయల్లో ఉంటుంది.


30, మార్చి 2024, శనివారం

Why do monkeys still exist? - కోతులు ఇంకా ఎందుకు ఉన్నాయి?

 


కోతి నుంచి మనిషి వచ్చాడన్నది సైన్స్ చెబుతున్న మాట. మరైతే.. కోతులు ఇంకా ఎందుకున్నాయి? అవి ఉండకూడదు కదా అనే ప్రశ్న చాలా మందికి ఉంది. దీనిపై సైంటిస్టులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 450 కోట్ల సంవత్సరాల కిందట భూమి ఏర్పడిన తర్వాత.. వందల కోట్ల సంవత్సరాలు భూమిపై ఏ జీవమూ లేదు. భూమి చల్లబడిన తర్వాత.. Pangaea అనే భారీ సముద్రం ఏర్పడింది. ఆ సమయంలో ఖండాలన్నీ కలిసి, ఒకటే ఖండంగా ఉండేవి. ఆ భారీ సముద్రం నుంచే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు ఆవిర్భవించాయి. క్రమంగా అవే రూపాంతరం చెందుతూ.. కోట్ల సంవత్సరాల్లో రకరకాల సముద్ర జీవులుగా మారాయి. ఈ సమయంలోనే ఏక ఖండం కాస్తా, వేర్వేరు ఖండాలుగా విడిపోయింది.


సముద్రంలోని కొన్ని రకాల జీవులు.. నేలపైకి రావడం ప్రారంభించాయి. ఇది జీవ పరిణామక్రమంలో మరో ముందడుగు అయ్యింది. నేలపైకి వచ్చిన జీవులు ఈత కొట్టలేవు కాబట్టి.. భూమిపై బతికేందుకు వీలుగా వాటికి కాళ్లు వచ్చాయి. మరికొన్ని జీవులు.. ఆకాశంలో ఎగిరేందుకు ప్రయత్నించాయి. వాటికి రెక్కలొచ్చాయి. ఇలా కోట్ల సంవత్సరాలు గడిచే కొద్దీ.. మనుగడ కోసం పోరాటం చేసే జీవులకు... అందుకు తగినట్లుగా మార్పులు వస్తున్నాయి. దీన్నే శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ జీవ పరిణామ క్రమ సిద్ధాంతం అంటారు.


కోతి నుంచి మనిషి రావడం అనేది కూడా ఒక్క రోజులో జరిగింది కాదు. చెట్లు ఎక్కుతూ, కొమ్మలు పట్టుకొని, అక్కడి పండ్లను తింటూ బతికే కోతుల్లో కొన్ని కొత్త జాతులు ఆవిర్భవించాయి. చింపాజీలు, ఒరంగుటాన్లు, గొరిల్లాల వంటివి అలా వచ్చినవే. ఆ తర్వాత వాటి నుంచి వచ్చిన జాతే మనిషి జాతి. కొత్తగా వచ్చే ప్రతి జాతీ.. దాని ముందు జాతి కంటే అన్ని రకాలుగా మెరుగుగా ఉంటుంది. అంతే తప్ప, అది ముందు జాతిని అంతం చెయ్యదు. అందువల్లే కోతులు ఇప్పటికీ ఉన్నాయి. ఇది జీవుల పరిణామ క్రమంలో జరిగే సహజ ప్రక్రియ. భవిష్యత్తులో మనిషిని మించిన జీవులు రావనే గ్యారెంటీ లేదు.


సృష్టిలో మరో ధర్మం కూడా ఉంది. ఏ జీవులైతే.. ప్రకృతిలో పరిస్థితులను తట్టుకొని నిలబడతాయో.. అవి మనుగడ సాగించగలుగుతాయి. తట్టుకోలేని జీవులు అంతరించిపోతాయి. డోడో పక్షి, టాస్మేనియా టైగర్, ఆఫ్రికా మమ్మోత్ ఏనుగులు, డైనోసార్లు వంటి చాలా జీవులు ఇలాగే అంతరించిపోయాయి.


29, మార్చి 2024, శుక్రవారం

Are Peanuts better than egg? - గుడ్డు కంటే పల్లీలే గొప్పవా?

 


మనలో చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లు తింటారు. ఐతే.. గుడ్ల కంటే వేరుశనగలు బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. పల్లీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కేజీ మాంసంలో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో, అన్ని ప్రోటీన్స్ వేరుశనగల్లోనూ ఉంటాయి. అలాగే కోడిగుడ్డు బరువుకి సమానమైన పల్లీలలో.. కోడిగుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి. అందువల్ల ప్రోటీన్ కావాలనుకునేవారు, పల్లీలు తినడం బెటరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మన దేశంలో వేరుశనగల కంటే.. వాటి నుంచి తీసే నూనె, డాల్డాను ఎక్కువగా వాడుతున్నారు. ఐతే.. పల్లీలు తినడానికి మాత్రమే కాదు.. వాటితో ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. సబ్బులు, నైట్రోగ్లిజరిన్, వార్నిష్, కలర్స్, పురుగుమందుల తయారీలో వీటిని వాడుతున్నారు. వేరుశనగల్లోని ప్రోటీన్‌తో దారాలు కూడా తయారుచేస్తున్నారు. వీటి తొక్కలతో సెల్యులోజ్‌ని చేస్తున్నారు. ఈ సెల్యులోజ్‌ని పేపర్, ప్లాస్టిక్, బోర్డుల తయారీకి వాడుతారు.


శరీరానికి కావాల్సిన శక్తి, ప్రొటీన్‌, పాస్ఫరస్‌, థెయామీన్‌, నియాసిన్‌ అనే పోషకాలు పల్లీల్లో ఉంటాయి. ఎ, బి, సి, ఇ సహా 13 రకాల విటమిన్లూ, ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌.. వంటి 26 రకాల కీలక ఖనిజాలూ ఈ పప్పుల్లో ఉంటాయి. అలాగే గుండెకు మేలు చేసే మోనో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు కూడా ఈ గింజల్లో లభిస్తాయి. 


స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ, క్యారెట్, బీట్‌రూట్ కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు పల్లీలలో ఉంటాయి. వేరుశనగలు క్యాన్సర్‌ను అడ్డుకోగలవు. అలాగే ముసలితనం త్వరగా రాకుండా చెయ్యగలవు. పిల్లల ఎదుగుదలకు ఇవి చాలా అవసరం. ఇలా పల్లీలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా, వీటిలో 70 శాతం ఉండే శాచురేటెడ్, 15 శాతం ఉండే పాలి అన్‌శాచురేటెడ్ కొవ్వులు.. పెద్దవారికి కీడు చేస్తాయి. అందువల్ల రోజూ ఓ గుప్పెడు పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిదనీ, అంతకంటే ఎక్కువ తింటే అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.


28, మార్చి 2024, గురువారం

Why mosquitoes bite pregnant women more? - దోమలు ఎందుకు గర్భిణులను ఎక్కువగా కుడతాయి?

 


ప్రపంచంలో దోమలు అన్ని దేశాల్లో ఉన్నాయి. రిపోర్టుల ప్రకారం.. అంటార్కిటికా, ఐస్‌లాండ్‌లో మాత్రమే దోమలు లేవు. మైనస్ ఉష్ణోగ్రతల వల్లే అక్కడ దోమలు లేవని తెలుస్తోంది. ఐతే.. దోమలు ఎవర్ని ఎక్కువగా కుడతాయి? వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.


దోమలు చెమట పట్టిన వారిని ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే.. చెమటలో ఉండే అమ్మోనియా, లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ అంటే దోమలకు ఇష్టం. అందువల్ల దోమలు కుట్టకూడదంటే, చెమట పట్టకుండా చూసుకోవాలి. అలాగే దోమలకు కార్బన్ డై ఆక్సైడ్ అంటే ఇష్టం. ఎవరైతే ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటారో, వారు ఎక్కువగా కార్బన్ డై ఆక్సై్డ్ వదులుతారు. అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. అధిక బరువు ఉన్నవారు, గర్భిణులు ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ చేస్తారు. అలాగే గర్భిణులకు చెమట కూడా ఎక్కువగా పడుతుంది. అందువల్ల వారిపై దోమలు 21 శాతం ఎక్కువగా దాడిచేస్తాయని పరిశోధనల్లో తేలింది.


దోమలు డార్క్ కలర్ డ్రెస్సులకు ఎట్రాక్ట్ అవుతాయి. ఎవరైతే రెడ్, బ్లాక్, నేవీ బ్లూ కలర్ డ్రెస్సులు వేసుకుంటారో, దోమలు వారిని ముందుగా కుడతాయి. అందువల్ల దోమలకు దొరకకూడదంటే, లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవాలి.


మద్యం తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే, మద్యం తాగాక వారికి ఎక్కువగా చెమట పడుతుంది. అందువల్ల మద్యానికి దూరంగా ఉంటే, దోమల నుంచి కూడా తప్పించుకోవచ్చు. బ్లడ్ గ్రూప్‌లలో O బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఏ, బీ గ్రూపుల వారిపై తక్కువగా దాడి చేస్తాయి. చర్మంపై గాయాలు, కురుపులూ ఉంటే.. అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి చోటికి దోమలు ఎక్కువగా వెళ్తాయి. అందువల్ల గాయాలను త్వరగా తగ్గించుకోవాలి.


మొత్తంగా సాయంత్రం వేళ స్నానం చేసి, లైట్ కలర్ డ్రెస్ వేసుకొని, చెమట పట్టకుండా చూసుకునేవారిపై దోమల దాడి తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.


27, మార్చి 2024, బుధవారం

Why didn't Moon fall on the ground? చందమామ ఎందుకు భూమిపై పడట్లేదు?

 


మనం ఒక రాయిని పైకి ఎగరేస్తే.. అది మళ్లీ భూమిపై పడుతుంది. కారణం భూమికి ఉండే గురుత్వాకర్షణ బలం. కానీ చందమామ మాత్రం.. భూమి చుట్టూ తిరుగుతుందే తప్ప.. భూమిపై పడట్లేదు. ఇలా ఎందుకు అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. కారణం తెలుసుకుందాం.


భూమికి ఉండే గ్రావిటీ పవర్ వల్లే.. చందమామ భూమి చుట్టూ తిరుగుతుంది. ఐతే.. ఈ గురుత్వాకర్షణ బలం.. వస్తువు ఎంత దూరంలో ఉంది, ఎంత బరువుతో ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దగ్గరగా ఉండే వస్తువులను భూమి బలంగా తనవైపు లాక్కుంటుంది. దూరంగా ఉండే వస్తువులపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంటుంది. చందమామ భూమికి 

3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల.. దానిపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంది. అలాగని పూర్తిగా గ్రావిటీ లేకుండా పోలేదు. అందువల్ల చందమామ భూమికి దూరంగా ఉన్నా.. పూర్తిగా వెళ్లిపోకుండా.. భూమి చుట్టూ తిరుగుతూ ఉంది.


చందమామ భూమిపై పడకుండా ఉండటానికి కారణం.. దాని పరిభ్రమణ వేగమే. భూమిపై ఉన్న వస్తువు.. భూమి గ్రావిటీ నుంచి తప్పించుకోవాలంటే అది సెకండ్‌కి 11 కిలోమీటర్లకు పైగా వేగం (Orbital velocity)తో వెళ్లాలి. మీరు ఒక రాయిని ఈ వేగంతో ఆకాశంలోకి విసిరితే.. ఆ రాయి.. కంటిన్యూగా అదే వేగంతో వెళ్తే.. అది భూమిపై పడదు. అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. అలాగే చందమామ కూడా భూమి చుట్టూ సెకండ్‌కి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ వేగంతో తిరుగుతోంది. చందమామపై భూమి గ్రావిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల.. అది సెకండ్‌కి 1 కిలోమీటర్ వేగంతో భూమి చుట్టూ తిరిగినా చాలు, అది భూమిపై పడదు. అలా కాకుండా చందమామ తిరగడం ఆగినా, వేగం తగ్గినా.. అది భూమిపై పడగలదు.


మనం ఒక బొంగరాన్ని తిప్పినప్పుడు.. అది వేగంగా తిరిగినంతసేపూ.. తిరుగుతూనే ఉంటుంది. వేగం తగ్గినా, తిరగడం ఆగినా.. అది పడిపోతుంది. ఇలాగే మనం ఒక బకెట్‌కి తాడు కట్టి.. దాన్ని మన చుట్టూ గుండ్రంగా తిప్పుతూ ఉంటే.. అలా తిప్పినంతసేపూ ఆ బకెట్... కింద పడదు. వేగం తగ్గించినా, తిప్పడం ఆపినా, ఆ బకెట్ భూమిపై పడిపోతుంది. ఇదే ఫార్ములా చందమామకూ వర్తిస్తుంది.


450 కోట్ల సంవత్సరాల కిందట చందమామ ఏర్పడినప్పుడు అది భూమికి 27 కిలోమీటర్ల దూరంలోనే ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. ఐతే.. చందమామ క్రమంగా భూమికి దూరంగా వెళ్తోంది. ఇప్పుడు కూడా సంవత్సరానికి 3.78 సెంటీమీటర్లు భూమికి దూరం వెళ్తోంది. అంటే.. భవిష్యత్తులో చందమామ.. మరింత దూరంగా వెళ్లిపోతుంది అనుకోవచ్చు.


ఒకవేళ చందమామ భూమివైపు రావడం మొదలుపెడితే.. భూమికి 18,470 కిలోమీటర్ల దగ్గరకు రాగానే పేలిపోతుంది. ఈ దూరాన్ని రోచ్ లిమిట్ అంటారు. ఈ లిమిట్ దాటి ఏది లోపలికి వచ్చినా పేలిపోతుంది. అందుకే ఉల్కలు, తోకచుక్కల వంటివి.. రోచ్ లిమిట్ లోకి రాగానే ముక్కలవుతాయి. చందమామ కూడా అలా వచ్చి, ముక్కలైతే.. ఆ రాళ్లు అగ్ని గోళాల్లా భూమిపై పడతాయి. దాంతో భూమిపై నగరాలన్నీ నాశనం అవుతాయి. జీవులన్నీ చనిపోతాయి. భూభ్రమణంలో కూడా మార్పులొస్తాయి. భూమి తిరిగే వేగం తగ్గిపోతుంది. భూతాపం బాగా పెరిగిపోతుంది. అలలు 30 వేల అడుగుల ఎత్తుకు లేస్తాయి. రోజూ 10 సునామీలు వస్తాయి. చివరకు యుగాంతం వస్తుంది. లక్కీగా అలా జరిగే ప్రమాదం లేదు. చందమామ భూమిపై పడే ఛాన్స్ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.



25, మార్చి 2024, సోమవారం

Why and how oxygen is collected? - ఆక్సిజన్‌ను ఎందుకు, ఎలా సేకరిస్తారు?

 


గాలిలో మనకు కావాల్సినంత ఆక్సిజన్ ఉంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‌ని సేకరించి, సిలిండర్లలో స్టోర్ చెయ్యాల్సి ఉంటుంది. ఆస్పత్రుల్లో పేషెంట్ల కోసం, సముద్రాల్లో డైవర్ల కోసం, పర్వతాలు ఎక్కేవారి కోసం, అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్ల కోసం, రాకెట్లలో ఫ్యూయల్ కోసం ఇలా చాలా అవసరాల కోసం ఆక్సిజన్‌ను సేకరిస్తారు. ఇందుకు రెండు ప్రత్యేక ప్రక్రియలు ఉన్నాయి.


జనరల్‌గా గాలిలో 21 శాతం ఆక్సిజన్‌, 78 శాతం నైట్రోజన్‌, ఒక శాతం ఇతర వాయువులు ఉంటాయి. గాలిలో ఆక్సిజన్‌ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని తొలిసారిగా లెవోషియర్‌, ప్రీస్ట్‌లీ అనే సైంటిస్టులు కనిపెట్టారు. రంగు, రుచి, వాసన లేని ఈ గ్యాస్.. భూమి పొరల్లో మెటల్ ఆక్సైడ్‌ (Metal oxide) రూపంలో 50 శాతం దాకా ఉంది. ఈ ఆక్సిజన్ వాయువుని చల్లబరిస్తే, మైనస్‌ 185 డిగ్రీల సెంటిగ్రేడు దగ్గర లైట్ బ్లూ కలర్ లిక్విడ్‌లా మారుతుంది. అలాగే మైనస్‌ 219 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు చల్లబరిస్తే, ఇది ఐస్ లాగా ఘనపదార్థంగా మారుతుంది.


ల్యాబ్‌లో పొటాషియం క్లోరేట్‌ (Potassium chlorate), మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ (Manganese dioxide)ని కలిపి వేడి చేస్తే, ఆక్సిజన్‌ గ్యాస్ తయారవుతుంది. అలాగే గాలి నుంచి కూడా ఫ్రాక్షనల్ డిస్టిల్లేషన్ (Fractional Destillation) విధానంలో ఆక్సిజన్‌ని సేకరించవచ్చు. ఇందుకోసం గాలిపై ఒత్తిడిని 200 రెట్లు పెంచి, సన్నని కన్నం ద్వారా, ఒక రూంలోకి పంపిస్తారు. రూంలోకి వెళ్లాక ఒత్తిడి ఒక్కసారిగా పోతుంది. దాంతో గాలి, లిక్విడ్ లాగా మారుతుంది. ఆ తర్వాత ఆ లిక్విడ్ నుంచి నైట్రోజన్‌ గ్యాస్‌ని వేరు చేస్తారు. దాంతో ఆక్సిజన్‌ లిక్విడ్ రూపంలో లభిస్తుంది. దీన్ని గ్యాస్ లాగా మార్చి సిలిండర్లలో నింపుతారు. ఇలా ఈ భూమిపై సమస్త జీవ రాశికీ ప్రాణ వాయువుగా చెప్పుకునే ఆక్సిజన్ గ్యాస్‌ని ప్రత్యేక పద్ధతుల్లో రెండు రకాలుగా సేకరిస్తారు.


24, మార్చి 2024, ఆదివారం

Why walk in the morning? - ఉదయం వేళ ఎందుకు నడవాలి?

 


కొంతమంది ఉదయం వేళ వాకింగ్ చేస్తారు. కొంతమంది సాయంత్రం వేళ చేస్తారు. ఆరోగ్య నిపుణులు మాత్రం సాయంత్రం కంటే మార్నింగ్ వాకే బెటర్ అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.


రాత్రివేళ మనం నిద్రపోయినప్పుడు విశ్రాంతి లభిస్తుంది. ఈ సమయంలో మన శరీరంలోని అన్ని అవయవాలూ రెస్ట్ తీసుకుంటాయి. మార్నింగ్ లేచాక కూడా చేతులు, కాళ్లు సహా చాలా అవయవాలు అలాగే ఉంటాయి. వాటిని యాక్టివ్ చేసేందుకు వాకింగ్ సరైనది అని నిపుణులు తేల్చారు.


ఉదయం వేళ నడిచే సమయంలో.. బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తద్వారా గుండె నుంచి శరీర భాగాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఫలితంగా అన్ని అవయవాలూ ఆక్సిజన్ పొందుతూ ఆరోగ్యంగా ఉంటాయి. నడక గుండెకు చాలా మంచిదని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు.. నడక వల్ల చెమట పడుతుంది. దాంతో చర్మ కణాలు క్లీన్ అవుతాయి. మృత కణాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మంపై ముడతలు తగ్గి, యంగ్ లుక్‌తో కనిపిస్తాం. 


రాత్రివేళ వాహనాల రాకపోకలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఉదయాన్నే వాతావరణంలో వాయు కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాకింగ్ చేస్తే, ఆక్సిజన్ బాగా లభిస్తుంది. అదే సాయంత్రం వేళైతే.. వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈవెనింగ్ కంటే మార్నింగ్ వాకే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.



23, మార్చి 2024, శనివారం

Meaning of Rose Flowers - 9 గులాబీలు ఇస్తే అర్థమేంటి?

 


మనందరికీ గులాబీలు నచ్చుతాయి. చాలా అందమైన, ఆకర్షణీయమైన ఈ పూలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ప్రేమను వ్యక్తం చెయ్యడానికి రోజాలనే ఎంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే సంప్రదాయం ఉంది.


రోజా పూలలో ఒక్కో రంగుకీ ఒక్కో అర్థం ఉంది. లవ్ ప్రపోజల్ కోసం రెడ్ కలర్ రోజాను ఇస్తారు. ఎవరికైనా థాంక్స్ చెప్పేటప్పుడు పింక్ కలర్ రోజాను ఇస్తారు. స్నేహాన్ని వ్యక్తం చెయ్యడానికి ఎల్లో కలర్ రోజా ఉంది. ఎవరైనా మీకు ఆరెంజ్ కలర్ గులాబీని ఇస్తే, దాని అర్థం వారు మీతో సంతోషంగా ఉన్నారని. అలాగే.. గొడవలు మానేసి, శాంతిగా ఉందాం అని చెప్పేందుకు వైట్ రోజాను ఇస్తారు. ఎవరికైనా ఫేర్‌వెల్ చెప్పేటప్పుడు కూడా వైట్ రోజ్ ఇస్తారు. ఇంకా.. ఎవరైనా మిస్టరీగా అనిపిస్తే, వారికి బ్లూ రోజాలను ఇస్తారు. మనం బలంగా ఉన్నాం, మనకు తిరుగులేదు అని చెప్పేందుకు గ్రీన్ రోజాలను ఇస్తారు. 


రోజాల కలర్స్ మాత్రమే కాదు.. నంబర్‌కి కూడా అర్థాలున్నాయి. ఒక అమ్మాయికి ఒక రోజా పువ్వు ఇస్తే, దాని అర్థం, తొలిచూపులోనే నిన్ను ప్రేమించాను అని. అదే 9 గులాబీలు ఇస్తే, మనిద్దరం జీవితాంతం కలిసి ఉందామని అర్థం. అదే 15 రోజాలు ఇస్తే, నీ నుంచి దూరం అవుతున్నందుకు క్షమించు అని అర్థమట. లవర్స్ లేదా పార్ట్‌నర్స్ బ్రేకప్ సమయంలో ఇలా 15 రోజాలు ఇచ్చుకుంటారు.


ప్రపంచంలో ఎన్నో రకాల పూలు ఉండగా.. రోజాలనే ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకంటే.. రోజా పూలంటేనే మానవ సంబంధాలు, స్వచ్ఛతకు ప్రతీక. మన జీవితంలోని స్నేహం, ప్రేమ, శాంతి, ఐకమత్యం ఇలా ప్రతీ ఫీలింగ్‌నీ వ్యక్తం చెయ్యడానికి రకరకాల రంగుల్లో రోజాలు ఉన్నాయి. ఐతే, ఎన్ని రంగులు ఉన్నా, రెడ్ రోజాలు అన్నింటికంటే గొప్పవిగా భావిస్తారు. ఎందుకంటే రెడ్ రోజాలు.. అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి, వాటిని చూడగానే పాజిటివ్ ఫీల్ కలిగిస్తాయి. ఇవి హృదయాన్ని టచ్ చేస్తాయి. మానవ సంబంధాలను బలపరుస్తాయి. అందుకే ప్రేమను వ్యక్తం చెయ్యడానికి రెడ్ రోజాలనే ఇస్తారు.


22, మార్చి 2024, శుక్రవారం

Are eggs vegetarian? - కోడిగుడ్లు శాకాహారమా?

 


కోడి మాంసాహారం అయినప్పుడు, కోడిగుడ్డు శాకాహారం ఎలా అవుతుంది? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కానీ డాక్టర్లేమో.. కోడిగుడ్డు శాకాహారం అనీ, రోజూ ఒక గుడ్డు తినాలని సూచిస్తుంటారు. దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలుసుకుందాం.


కోడిగుడ్లలో ప్రధానంగా 2 రకాలున్నాయి. 1.నాటుకోడి గుడ్లు. 2.ఫారంకోడి గుడ్లు. నాటుకోడి గుడ్లు సహజమైనవి. అంటే.. ఈ గుడ్లు ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా వస్తాయి. అంతేకాదు.. వీటిని కోడిపెట్ట పొదిగితే, కోడిపిల్లలు కూడా వస్తాయి. అందువల్ల నాటుకోడి గుడ్లు అసలైన, నిజమైన కోడిగుడ్లు కింద లెక్క.


ఫారంకోడి గుడ్లు కృత్రిమమైనవి. ఈ గుడ్లను జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతిలో.. జన్యుపరమైన మార్పులు చేసి, కోడి గర్భం నుంచే గుడ్లు వచ్చేలా చేస్తారు. కానీ ఈ గుడ్లను పొదిగితే కోడిపిల్లలు రావు. ఎందుకంటే, ఈ గుడ్లలో ఫలదీకరణం చెందిన అండం ఉండదు. అంటే.. ఈ గుడ్లను పెట్టే కోళ్లకు, కృత్రిమ పద్ధతిలో శుక్రద్రవాన్ని ఇంజెక్ట్‌ చేస్తారు. ఇందులో కోడిపుంజు ప్రమేయం ఉండదు. అందువల్ల ఫారం కోడి గుడ్లలో జీవం ఉండదు.


ఫారం కోడి గుడ్లలో తెల్లసొన, పసుపు సొనతో ఉన్న ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందుకే వీటిని శాకాహారం అంటారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తారు? నాటుకోడి గుడ్లనే పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చెయ్యవచ్చుగా? అనే మరో ప్రశ్న మనకు రావచ్చు. నాటుకోడి గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అదే ఫారంకోడి గుడ్లను చల్లటి వాతావరణంలో ఎక్కువ కాలం నిల్వ ఉంచినా పాడవ్వవు. అంటే.. ఫ్రిజ్‌లో 3 నుంచి 5 వారాలు ఉంచినా బాగానే ఉంటాయి. అదే ఫ్రీజర్‌లో ఉంచితే, సంవత్సరం వరకూ పాడవకుండా ఉంటాయి.


21, మార్చి 2024, గురువారం

Does a person die if a crow scratches head? - కాకి తలపై గీరితే చనిపోతారా?

 


కాకులు మన ఇళ్ల దగ్గరే జీవిస్తాయి. ఎక్కువగా కొబ్బరి చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. మనం తినే చాలా రకాల ఆహారాలను కాకులు తింటాయి. మన పురాణాల్లో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతేకాదు.. కాకులు చాలా తెలివైనవి. క్రమశిక్షణ పాటిస్తాయి. ఒక కాకికి ఆహారం దొరికితే, అది మిగతా కాకులనూ పిలుస్తుంది. అలాగే ఒకటి చనిపోతే, మిగతా కాకులన్నీ బాధ వ్యక్తం చేస్తాయి. అందుకే కాకుల పట్ల మనం పాజిటివ్ ఫీలింగ్స్‌తో ఉంటాం. అయితే.. ఒక్కోసారి కాకులు మనపై దాడి చేస్తాయి. ఎందుకో తెలుసుకుందాం.


సాధారణంగా కాకులు మనపై దాడి చెయ్యవు. కాకుల గూళ్లలో పిల్లలు ఉన్నప్పుడు, ఆ చెట్లకు దగ్గరగా ఎవరైనా వెళ్తే, కాకులు దాడి చేస్తాయి. అలాగే.. పిల్లల్లో ఏదైనా మిస్సింగ్ అయితే కూడా.. కాకులు ఆగ్రహంతో అటుగా వచ్చే వారిపై దాడి చేస్తాయి. ఇలా దాడి చేసేటప్పుడు అవి వేగంగా వచ్చి.. కాలి గోళ్లతో తలపై గీరుతూ ఎగురుతాయి. మరి ఇలా గీరితే చనిపోతారనే ప్రచారం ఉంది. నిజానికి అది మూఢనమ్మకం మాత్రమే.


ఈ మూఢనమ్మకం రావడానికి కారణం.. పేదరికం. పూర్వం కాకులు దాడి చేసినప్పుడు సరైన వైద్య సదుపాయాలు ఉండేవి కావు. ఐతే.. కాకులు రకరకాల ఆహారాలను కాలి గోళ్లతో చీల్చుతూ తింటాయి. కుళ్లిపోయిన వాటినీ, చనిపోయిన జీవుల మాంసాన్నీ కాళ్లతో పీక్కుతింటాయి. అందువల్ల వాటి గోళ్లలో రకరకాల వైరస్, బ్యాక్టీరియా ఉంటాయి. అవి కాళ్లతో తలపై గీరినప్పుడు, గాయం అయితే.. ఆ వైరస్, బ్యాక్టీరియా, ఆ గాయం ద్వారా శరీరంలోకి వెళ్లగలవు. అలాంటి సందర్భంలో.. జబ్బులు వచ్చి, చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే కాకి గీరితే, చనిపోతారనే మూఢనమ్మకం వచ్చింది.


ఈ రోజుల్లో వైద్య సదుపాయాలు చాలా డెవలప్ అయ్యాయి. కాకి గీరినప్పుడు షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే కాకి దాడి చేస్తున్నప్పుడు.. ఓ కర్రను తల కంటే పైకి పట్టుకుంటే.. కర్ర కారణంగా కాకి దగ్గరకు రాదు. అలా కాకుల దాడి నుంచి తప్పించుకోవచ్చు.


Why is the noise of airplanes less at night? - విమానాల శబ్దం రాత్రివేళ ఎందుకు తక్కువగా వినిపిస్తుంది?

 


మనందరం ఆకాశంలో వెళ్లే విమానాలను తరచూ చూస్తూనే ఉంటాం. విమాన వేగం కంటే, ధ్వని వేగం తక్కువ కాబట్టి, ఫ్లైట్ కొంత ముందుకు వెళ్లాక, దాని సౌండ్ మనకు వినిపిస్తుంది. విమానం గాలిని చీల్చుతూ వెళ్లడం వల్ల ఈ ధ్వని ఉత్పత్తి అవుతుంది. అలాగే విమాన ఇంజిన్ల శబ్దం కూడా ఈ ధ్వనిలో ఉంటుంది. ఐతే.. పగటివేళ విమానం వెళ్లినప్పుడు వినిపించేంత శబ్దం, రాత్రివేళ ఎందుకు వినిపించదు? తెలుసుకుందాం.


పగటివేళ రకరకాల ధ్వనులు వస్తూ ఉంటాయి. అయినా ఆకాశంలో విమానం వెళ్తే, శబ్దం బాగా వినిపిస్తుంది, రాత్రివేళ వేరే శబ్దాలు లేకపోయినా, విమాన ధ్వని చాలా తక్కువగా వినిపిస్తుంది. దీనికి కారణం గాలిలో ధ్వని ప్రయాణించే విధానమే. గాలి వేగం, బరువును బట్టి, శబ్ద తరంగాల ప్రయాణం ఆధారపడి ఉంటుంది. రాత్రివేళ కంటే, పగటి పూట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, గాలి వేగం తక్కువగా ఉంటుంది. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు శబ్ద తరంగాలు మనల్ని పూర్తిగా చేరలేవు.


గాలి బరువును పరిశీలిస్తే, పగటివేళ ఉష్ణోగ్రత కారణంగా గాలి బరువు తక్కువగా ఉంటుంది. అలాగే రాత్రివేళ గాలి బరువు ఎక్కువగా ఉంటుంది. గాలి బరువు తక్కువగా ఉన్నప్పుడు.. ధ్వని ఎక్కువ దూరం వినిపించగలదు. అందుకే పగటివేళ విమాన శబ్దం మనకు బాగా వినిపిస్తుంది. రాత్రివేళ చల్లదనం వల్ల గాలి బరువెక్కుతుంది. బరువైన గాలిలో శబ్ద తరంగాలు ఎక్కువ దూరం వెళ్లలేవు. అందుకే మనకు రాత్రివేళ విమాన శబ్దం తక్కువగా వినిపిస్తుంది.


పగటివేళ ధ్వనికి తీవ్రత (sound intensity) ఎక్కువగా ఉంటుంది. అందువల్ల విమాన శబ్దం మనకు స్పష్టంగా వినిపిస్తుంది. రాత్రివేళ ధ్వని తీవ్రత సరిగా ఉండదు. ఈ లక్షణం వల్ల కూడా రాత్రివేళ విమాన శబ్దం తక్కువగా వినిపిస్తుంది.


20, మార్చి 2024, బుధవారం

What is humidity? - తేమ అంటే ఏంటి?

 




మనందరం వాతావరణంలో తేమ శాతం పెరిగిందనీ, తగ్గిందనీ వచ్చే వార్తలు వింటుంటాం. అప్పుడు మనకు చాలా డౌట్స్ వస్తాయి. అసలు ఈ తేమ అంటే ఏంటి? నీటినే మనం తేమ అంటున్నామా? అనే ప్రశ్నలు కలుగుతాయి. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


నిజానికి నీటి మరో రూపమే తేమ. ఈ నీరు.. వేడెక్కినప్పుడు గ్యాస్ లాగా మారుతుంది. దాన్నే మనం నీటి ఆవిరి అంటాం. దాన్నే తేమ అని కూడా అంటాం. ఈ తేమ మనకు కనిపించదు. ఎందుకంటే.. నీటి అణువులు చాలా చిన్నగా ఉంటాయి. నీరు, గ్యాస్‌గా మారినప్పుడు ఈ అణువుల మధ్య దూరం పెరుగుతుంది. అదే అణువులు.. తిరిగి దగ్గరైనప్పుడు.. నీటి రూపంలోకి మారతాయి. అప్పుడు మనం వాటిని చూడగలం. ఒక నీటి చుక్కలో 1.5 సెక్స్టిలియన్ అణువులు ఉంటాయి. ఒక సెక్స్టిలియన్ అంటే.. ఈ నంబర్‌కి 1 పక్కన 21 జీరోలు ఉంటాయి. ఈ లెక్కన 1.5 సెక్స్టిలియన్ అణువులంటే ఎంత ఎక్కువో అంచనాకు అందదు.


మనకు కనిపించే మేఘాలన్నీ నీరే. సూర్యుడి ఉష్ణోగ్రత వల్ల.. నీరు వేడెక్కి.. ఆవిరిగా మారాక.. ఆ అణువులు.. విడివిడిగా అయిపోతూ.. వాతావరణంలో స్వేచ్ఛగా ఉంటాయి. వేడి తగ్గుతున్నప్పుడు.. అవే అణువులు దగ్గరవుతూ.. ఆకాశంలో మేఘాల రూపంలో ఉంటాయి. వేడి మరింత తగ్గే కొద్దీ.. మేఘాల్లో నీటి అణువుల మధ్య దూరం బాగా తగ్గిపోతుంది. అప్పుడు అణువులన్నీ దగ్గరవుతుంటే.. వాటికి నీటి రూపం వస్తుంది. నీరుగా మారగానే.. భూమ్యాకర్షణ వల్ల ఆ నీరు... భూమిపై పడుతుంది. దాన్నే మనం వర్షం అంటున్నాం.


వాతావరణంలో నీటి ఆవిరి.. అదే.. తేమ ఎక్కువగా ఉంటే.. ఆ సమయంలో.. ఎండ పడకుండా మేఘాలు సూర్యుడికి అడ్డుగా వస్తే.. క్రమంగా వాతావరణంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా నీటి ఆవిరి మేఘాలతో కలుస్తుంది. దాంతో మేఘాల రూపంలో ఉన్న అణువులు.. మరింత దగ్గరకు చేరి పూర్తి స్థాయి నీరుగా మారుతాయి. అందువల్ల వర్షం పడుతుంది.


వాతావరణ అధికారులు.. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది అని చెబితే.. అప్పుడు వర్షం పడే అవకాశాలు ఉంటాయని మనం అనుకోవచ్చు. అదే సమయంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు కూడా ఉండాలి. అప్పుడే వాన పడగలదు. గాలిలో తేమ 80 శాతానికి పైగా ఉంటే చిరుజల్లులు కురుస్తాయి. 90 శాతానికి పైగా ఉంటే, ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. 100 శాతానికి చేరినప్పుడు భారీ వర్షం పడుతుంది. ఇలా తేమ శాతం పెరిగేకొద్దీ.. మనకు వర్షం, చల్లదనం పెరుగుతాయి. 


వాతావరణంలో తేమ ఎంత శాతం ఉంది అనేది.. ఉష్ణోగ్రతతోపాటూ.. గాలి వల్ల కూడా డిసైడ్ అవుతుంది. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు.. గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు తేమ కూడా తక్కువగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, గాలిలో తేమ 30 శాతం నుంచి 70 శాతం మధ్య ఉండాలి. 30 శాతం కంటే తక్కువ ఉన్నా, 70 శాతం కంటే ఎక్కువ ఉన్నా.. రకరకాల అనారోగ్యాలు రాగలవు. ఇలా గాలిలో తేమ.. వాతావరణ అంచనాల్లో కీలక అంశంగా ఉంటుంది.



Does eating fish prevent diabetes? - చేపలు తింటే డయాబెటిస్ రాదా?


ఇండియాలో కోట్ల మందికి డయాబెటిస్ ఉంది. రోజురోజుకూ ఈ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. డయాబెటిస్.. 90 శాతం వరకూ.. జన్యువుల కారణంగా.. వంశపారంపర్యంగా వస్తుంది. అంటే వంశంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే.. వారి వారసులకు కూడా ఏదో ఒక వయసులో అది వస్తుంది. కారణం డయాబెటిస్ జీన్.. వారి DNAలో డామినెంట్ జీన్‌గా ఉండటమే. అలాంటి వారు ఏం తిన్నా, తినకపోయినా, డయాబెటిస్ మాత్రం వస్తుంది. ఐతే, సాధారణంగా. చేపలు తింటే, డయాబెటిస్ రాదా అన్నది తెలుసుకుందాం.


ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకూ జరిగిన చాలా పరిశోధనల్లో.. మాంసం బదులు చేపలు తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతున్నాయి. రోజూ చేపలు తినడం వల్ల డయాబెటిస్‌ని దూరంగా ఉంచవచ్చని.. లండన్‌లోని వలెన్సియా యూనివర్సిటీ నిపుణులు తేల్చారు. వయస్సు 55 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న 945 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు. 


చేపలు తిన్న వారిలో డయాబెటిస్‌ సాధారణ స్థితిలో ఉంటోంది. అంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్ సాధారణ స్థితిలో ఉంటోంది. అదే సమయంలో, మాంసం తిన్న వారిలో షుగర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. తద్వారా చేపలు తినడం వల్ల డయాబెటీస్‌ కంట్రోల్‌‌లో ఉంటోందని తేల్చారు. అలాగే చేపలు తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు.


హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. వారానికి ఒకసారి చేపలు తింటే.. అలాంటి వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువగా ఉంటోంది. ఎందుకంటే.. చేపల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోకుండా చేస్తున్నాయి. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి అయితే, డయాబెటిస్ సమస్య ఉండదు. అందువల్ల డయాబెటిస్ రాకుండా ఉండాలన్నా, ఆల్రెడీ ఉన్న డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలన్నా చేపలు తినాలని నిపుణులు చెబుతున్నారు.

 


16, మార్చి 2024, శనివారం

Why flame always goes up? ఎందుకు మంట ఎప్పుడూ పైకి లేస్తుంది?

 


భూమికి ఆకర్షణ శక్తి ఉండటం వల్ల, ఏదైనా వస్తువు మన చేతి నుంచి జారితే, అది భూమిపైనే పడుతుంది గానీ ఆకాశం వైపు వెళ్లదు. నీరు కూడా భూమివైపే పడుతుంది తప్ప.. పైకి వెళ్లదు. కానీ మంట మాత్రం పైకే వెళ్తుంది. భూమిపై ఎక్కడ ఎలాంటి మంట వచ్చినా, అది పైకే ఎగసిపడుతుంది తప్ప, భూమివైపు వెళ్లదు. ఇందుకు కారణం తెలుసుకుందాం.


మంట పైకి వెళ్లడానికి ప్రధాన కారణం గాలి. మంట మండేటప్పుడు, తన చుట్టూ ఉన్న గాలిని వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి బరువు తగ్గుతుంది. తేలికైన గాలిపై భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో ఆ గాలి.. భూమి నుంచి దూరంగా పైకి వెళ్తుంది. అలా ఆ గాలి వెళ్లగానే.. ఆ ప్రదేశంలోకి బరువైన గాలి వచ్చి చేరుతుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. 


పైకి వెళ్లే గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. బరువైన గాలి వేగం తక్కువగా ఉంటుంది. మంటచుట్టూ ఉండే గాలి.. పైకి వెళ్తున్నప్పుడు.. దాని కారణంగా.. మంట కూడా పైకే వెళ్తుంది. అందుకే మంట ఎప్పుడూ పైకే వెళ్తుంది.


పెద్దల సమక్షంలో, విద్యార్థులు ఓ చిన్న ప్రయోగంతో దీన్ని చేసి చూడవచ్చు. ఓ కొవ్వొత్తిని వెలిగించినప్పుడు, మంట పైకి వెళ్తుంది. ఆ కొవ్వొత్తిని పక్కకు వంచినా, కిందకు వంచినా, ఎటు వంచినా, మంట మాత్రం వంగకుండా, పైకే వెళ్తుండటాన్ని గమనించవచ్చు. మరో విషయం.. దేనికైనా నీడ ఉంటుంది గానీ, మంటకు ఉండదు. అందువల్ల కొవ్వొత్తి, దాన్ని పట్టుకున్నవారి నీడ కనిపిస్తుంది కానీ, మంట నీడ కనిపించదు. అందుకే వెలుతురు ఉన్న చోట, చీకటి ఉండదు అంటారు.